23-10-2025 01:56:03 AM
నారాయణఖేడ్, అక్టోబర్ 22: నారాయణఖేడ్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే డాక్టర్ పి.సంజీవరెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఐకెపి ద్వారా, సొసైటీల ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. క్వింటాలుకు రూ. 2,388 మద్దతు ధరను ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. రైతులకు తరుగు క్వింటాలుకు కిలోన్నర మాత్రమే తీయాలని అధికారులకు ఆదేశించారు.
రైతుల నుండి లారీల ఖర్చుల డబ్బులు వసూలు చేయరాదని అధికారులకు సూచించారు. తమ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమని అన్నారు. సన్న వడ్లకు రూపాయలు 500 చొప్పున బోనస్ ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. నియోజకవర్గంలోని శంకరంపేట, రామిరెడ్డి పేట, సంజీవనరావుపేట, నిజాంపేట్, తుర్కపల్లి తదితర గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఆయన వెంట ఐకెపి, వ్యవసాయం అధికారులు, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.