09-07-2025 05:05:41 PM
మీ చదువుతో దేశ భవిష్యత్తుని మార్చొచ్చు..
రూ 3.10 కోట్లతో ఒకేషనల్ జూనియర్ కాలేజ్ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): ఎదగాలనే పట్టుదల నిరంతరం మదిలో ఉంచుకొని తలవంచి చదివితే మీ జీవితాంతం తల ఎత్తుకొని జీవిస్తారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy) అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని రూ 3.10 కోట్లతో ఒకేషనల్ జూనియర్ కాలేజ్ భవన నిర్మాణానికి, రూ 2 కోట్లతో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... మీ తల్లిదండ్రులు మీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, వారు కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారని చెప్పారు.
ఈ రెండు సంవత్సరాలు కష్టపడితే భవిష్యత్తు బాగుంటుందని, టైపాస్ చేస్తే జీవితం కూడా టైంపాస్ అవుతుందని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉన్నారని, ఆయన ప్రతి వారం విద్యపైన సమీక్ష నిర్వహిస్తున్నారని తెలిపారు. వారి ఆశీస్సుల తోనే బాసర ఐఐఐటి కళాశాలను మన మహబూబ్ నగర్ కు రావడం జరిగిందని చెప్పారు. మీకు ఎన్నో అద్భుతమైన అవకాశాలు వస్తున్నాయని, మీకు కావాల్సిన అన్ని సౌకర్యాలు, వసతులు కల్పించడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.
ఒక్క ఏడాదిలోనే 36 నుంచి 26వ స్థానానికి..
గతంలో మన తెలంగాణ రాష్ట్రం విద్యలో దేశంలో 36వ స్థానంలో ఉండేదని, కేవలం ఒక్క సంవత్సరంలోనే 26వ స్థానానికి తెలంగాణ రాష్ట్రం రావడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రానున్న రెండు మూడు సంవత్సరాల్లో 5 స్థానాల లోపు తెలంగాణ రాష్ట్రం ఉండాలని, మనందరి కృషితోనే అది సాధ్యం అవుతుందని చెప్పారు. రాబోయే రోజుల్లో ఉమ్మడి జిల్లాలోనే కాకుండా, తెలంగాణ రాష్ట్రంలోనే మన ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, ఒకేషనల్ జూనియర్ కళాశాల మొదటి స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు.
మొన్నటి వరకు ఒక లెక్క ఇప్పటినుండి ఒక లెక్క అని చెప్పారు. ఎలాంటి సౌకర్యాలు కావాలన్నా ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. గత సంవత్సరం ఎప్సెట్ లో 114 మంది విద్యార్థులకు ఉచితంగా ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ లో సీట్లు సాధించారని, ఈ సంవత్సరం ఈ సంఖ్య మరింత గణనీయంగా పెరగాలని, ప్రొఫెషనల్ కోర్సులలో ఆసక్తి ఉన్న విద్యార్థులు ఎవరైనా ఇక్కడ ఇచ్చే ఎప్సెట్ శిక్షణలో చేరి ఉచితంగా శిక్షణ పొందవచ్చు అని స్పష్టం చేశారు. ప్రైవేటు కళాశాలలకు ధీటుగా ప్రభుత్వ కళాశాలల్లో విద్యను అందిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, టి పిసిసి అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, మహబూబ్ నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్, రాజేందర్ రెడ్డి, గట్టు వెంకట్ రెడ్డి, సతీష్ రెడ్డి, భీం రెడ్డి, డా.జహంగీర్ అలీ, ఇంటర్మీడియట్ విద్యాధికారి కౌసర్ జహాన్, కళాశాల ప్రిన్సిపాల్ భగవంతచారి, ఒకేషనల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ భగవాణి నర్సింహులు, నర్సింహారెడ్డి, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.