09-07-2025 07:24:40 PM
సమ్మెతో నిర్మానుష్యంగా మారిన గని ప్రాంగణాలు..
సమ్మెకు మద్దతుగా కార్మిక సంఘాల ధర్నా ఆందోళనలు..
మందమర్రి (విజయక్రాంతి): కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, కార్మికుల పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను యధాతధంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సింగరేణి(Singareni)లో విజయవంతం అయింది. జాతీయ కార్మిక సంఘాలు కార్మిక హక్కులు, చట్టాల పరిరక్షణ కోరుతూ ఇచ్చిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె బుధవారం సింగరేణిలో పూర్తిస్థాయిలో విజయవంతం అయింది. సింగరేణి విస్తరించి ఉన్న ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పరిధిలో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా స్తంభించింది.
సింగరేణిలో గుర్తింపు సంఘం ఏఐటీయుసీతో పాటు అన్ని జాతీయ, ప్రాంతీయ కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పాటై సమ్మె ఆవశ్యకతపై గత పది రోజులుగా గనులు డిపార్ట్మెంట్ల వారీగా గేట్ మీటింగ్ లు నిర్వహిస్తూ కార్మిక చట్టాల మార్పు వల్ల కలిగే నష్టాలను కార్మికులకు వివరిస్తూ, కార్మికులు పోరాడి సాధించుకున్న అనేక హక్కుల పరిరక్షణకు సమ్మె ఆయుధ మని, సమ్మె ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని కార్మికులకు వివరించడంతో మెజారిటీ కార్మికులు సమ్మెకు సన్నద్ధమై సార్వత్రిక సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించి స్వచ్ఛందం గా సమ్మెలో పాల్గొనీ తమ నిరసనను కేంద్ర ప్రభుత్వానికి వ్యక్తం చేశారు. సింగరేణి వ్యాప్తంగా భూగర్భ ఉపరితలంలో విధులు నిర్వహిస్తున్న కార్మికులతో పాటు, కాంట్రాక్ట్ కార్మికులు సమ్మెకు మద్దతు ప్రకటించి సమ్మెలో పాల్గొనడంతో సింగరేణి వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తి, రవాణా పూర్తిగా నిలిచిపోయింది. కార్మికుల సమ్మెతో నిత్యం కళకళలాడే కోల్బెల్టు రహదారులు కార్మికుల సందడి లేక నిర్మానుష్యంగా మారాయి.
సమ్మె సంపూర్ణం
జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సమ్మెలో సింగరేణి కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొనడంతో సింగరేణి వ్యాప్తంగా 11 డివిజన్ల లో సమ్మె విజయ వంతం అయింది. సింగరేణి వ్యాప్తంగా ఉన్న బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్, రామగుండం నుంచి 1, 2 ,3 , భూపాలపల్లి కొత్తగూడెం మణుగూరు ఇల్లందు ఏరియాలలోని కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొనడంతో సింగరేణి వ్యాప్తంగా 1.92 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి స్తంభించి యజమాన్యానికి సుమారు 76 కోట్ల నష్టం వాటిల్లగా, కార్మికులు 13.07 కోట్లు వేతన రూపంలో నష్టపోయారు.
బోసిపోయిన గని ప్రాంగణాలు...
సింగరేణి కార్మికులతో నిత్యం కళకళలాడే బొగ్గు గనులు దేశ వ్యాప్త సమ్మెలో కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొని సమ్మెకు మద్దతుగా నిలవడంతో సింగరేణిలోని బొగ్గు గనులు కార్మికుల సందడి లేక నిర్మానుష్యంగా మారాయి. నిత్యం కార్మికులతో కలకల లాడే గని ప్రాంగణాలు సమ్మె మూలంగా బోసిపోయి దర్శనమిచ్చాయి. గనుల్లో అత్యవసర కార్మికులు మినహా మిగతా కార్మికులు విధులకు హాజరు కాక పోవడంతో సింగరేణి వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచి పోయింది.
సమ్మెకు మద్దతుగా ఆందోళనలు...
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జాతీయ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మెకు మద్దతుగా సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాలలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరస నలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. బెల్లంపల్లిలో కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జీఎం కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. మందమర్రిలో సిఐటియు ఆధ్వర్యంలో జీఎం కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టగా, ఏఐటియుసి ఆధ్వర్యంలో యూనియన్ కార్యాలయం నుండి మార్కెట్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. కాంట్రాక్ట్ కార్మికులు మున్సిపల్ కార్యాలయం నుండి పాత బస్టాండ్ జయశంకర్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. శ్రీరాంపూర్ లో సమ్మెకు మద్దతుగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ ధర్నా చేపట్టి లేబర్ కోడ్ ల దిష్టి బొమ్మను దహనం చేశారు, మంచిర్యాల జిల్లా కేంద్రంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు.
రామగుండం 1, 2, 3 డివిజన్లలో కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మానవహారం, ధర్నా నిర్వహించారు. భూపాలపల్లిలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన చేపట్టారు. కొత్తగూడెం ఇల్లందు మణుగూరు ఏరియాలలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేపట్టారు. కార్మిక సంఘాల ఆందోళనలతో సింగరేణి వ్యాప్తంగా మోడీ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నినాదాలతో మారుమోగింది. ఏది ఏమైనప్పటికీ సింగరేణి వ్యాప్తంగా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతం కావడం తో జాతీయ కార్మిక సంఘాలలో రెట్టింపు ఉత్సాహం నెలకొంది. ఇదే స్ఫూర్తితో కార్మికులు ఉద్యమించి 10 గంటల పని విధానానికి స్వస్తి పలకాలి.