09-07-2025 07:54:00 PM
సిఐటియు మండల కన్వీనర్ వరికుప్పల ముత్యాలు..
మునుగోడు (విజయక్రాంతి): మల్టీపర్పస్ విధానాలతో గ్రామపంచాయతీ సిబ్బందిని అనేక రకాలుగా వేధిస్తున్నారని, పనిచేస్తున్న ఉద్యోగ కార్మికులందరినీ వెంటనే పర్మినెంట్ చేయాలని సిఐటియు మండల కన్వీనర్ వరికుప్పల ముత్యాలు(CITU Mandal Convener Varikuppala Mutyalu) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మునుగోడు మండల కేంద్రంలో సిఐటియు కార్యాలయంలో తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు మునుగోడు మండలం జనరల్ బాడీ సమావేశానికి హాజరై మాట్లాడారు. రెక్కాడితే తప్ప డొక్క నిండని గ్రామపంచాయతీ కార్మికులకు ప్రతినెల ఇవ్వాల్సిన వేతనాలు ఐదు నెలలకు ఒకసారి, మూడు నెలలకోసారి వేతనాలు ఇవ్వడంతో పూట గడవక వస్తువులతో అవస్థలు పడుతున్నారని అన్నారు.
పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అర్హత కలిగిన గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికుల అందర్నీ పర్మినెంట్ చేయాలని కోరారు. అప్పటివరకు కనీస వేతనం 21 వేలు ఇవ్వాలని మల్టీ పర్పస్ విధానం రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనేక పోరాటాలు చేసి సాధించుకున్న జీవో నెంబర్ 51 కార్మికుల గుదిబండగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. 9500 వేతనం మాత్రమే ఇస్తూ కార్మికులను పనిగంటల, సెలవులు నిమ్మితం లేకుండా అధికారులు, కార్యదర్శులు వెట్టిచాకిరి చేస్తున్నారని అన్నారు. మల్టీ పర్పస్ విధానం పేరుతో కార్మికులను ఘోరమైన వేధింపులకు గురిచేస్తున్నారని అన్నారు.
గ్రామ పంచాయతీ తో సంబంధం లేని పనులు చేయిస్తూ ఇదేమి న్యాయం అని ప్రశ్నిస్తే తొలగింపులు వేధింపులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు గ్రామపంచాయతీ కార్మికులకు ఆదివారం పండగ సెలవులు ఇచ్చే విధంగా 8 గంటల పని చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనియెడల జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. మండల అధ్యక్షుడు పెరమళ్ళ రాజు అధ్యక్షతన సమావేశంలో రాజీవ్, లక్ష్మయ్య, జీడిమడ్ల దశరథ ,బుడిగపాక లింగస్వామి ,సహాయ కార్యదర్శి అరుణ ,జలంధర్ కార్యదర్శులు శివశంకర్ , సంజీవ , లింగయ్య ,కోశాధికారి వంపు యాదయ్య ,మండల సభ్యులు సుజాత ,సునీత , సంధ్యారాణి , లింగయ్య ఉన్నారు.