calender_icon.png 10 July, 2025 | 12:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మిక, కర్షక, వ్యవసాయ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలి

09-07-2025 07:34:19 PM

కార్పొరేట్ అనుకూల, మతోన్మాద చర్యలను బిజెపి వీడనాడాలి..

సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు.. 

నాగారం: కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన మతతత్వ బిజెపి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను, కార్పోరేట్ అనుకూల, మతోన్మాద చర్యలను విడనాడాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు(CPM State Committee Member Kolisetty Yadagiri Rao) అన్నారు. బుధవారం నాగారం మండల కేంద్రంలో దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా సార్వత్రిక సమ్మెను నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ... సమరశీల పోరాటాల ద్వారా 100 సంవత్సరాల్లో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోట్లను తీసుకొచ్చిందన్నారు.

కార్మిక వర్గం అనేక పోరాటాల ఫలితంగా లేబర్ కోడ్ లు అమలుకు ఆలస్యం అయినా ప్రస్తుతం వాటిని అమలు చేసి కార్మిక వర్గం హక్కులను హరించే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. 2025-26 బడ్జెట్ లో కార్పొరేట్ అనుకూల విధానాలకు అనుగుణంగా కేటాయింపులు చేసిందన్నారు. సామాజిక సంక్షేమానికి కోతలు పెట్టిందన్నారు. సామాన్యులపై బారాలు  మోపి, కార్పొరేట్ గుత్త సంస్థలకు, పెట్టుబడుదారులకు ఐదు వేల కోట్లు రాయితీ ప్రకటించింది అన్నారు. ఉపాధి, నిరుద్యోగం, అధిక ధరలు, ఆకలి, అసమానతలు, ఆరోగ్య రక్షణ లాంటి ప్రాథమిక సమస్యలు పట్టించుకోలేదన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను రక్షించుకునేందుకు కార్మిక వర్గం ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలన్నారు.

రైతు పండించిన పంటకు మద్దతు ధర చట్టం చేయాలన్నారు. ఎమ్మెస్ స్వామినాథన్ సిఫారసులను అమలు చేయడంలో ఎన్డీఏ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని విమర్శించారు. ఢిల్లీలో రైతులు పోరాటం చేసిన సందర్భంగా రాతపూర్వకంగా ఇచ్చిన ఏ ఒక్క హామీని నేటికీ అమలు చేయలేదన్నారు. కనీస మద్దతు ధర చట్టం చేయాలన్నారు. అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రోజురోజుకు నిర్వీర్యం చేస్తుందని అన్నారు. వ్యవసాయ కార్మికుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం సమగ్ర శాసన చట్టం చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ వ్యవసాయ కార్మికుల జీవితాల్లో మాత్రం మార్పు రావడం లేదన్నారు. వలసల నివారణ కోసం వచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని సక్రమంగా అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని విమర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వం భూమిలేని వ్యవసాయ కార్మికులకు ఇస్తామన్న ఏడాదికి 12,000 నేటికీ అమలు కాలేదు అన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రతిష్టపరిచి  16 రకాల నిత్యవసర వస్తువులను పేదలందరికీ అందించాలన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం ఈ 11 సంవత్సరాల కాలంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, వ్యవసాయ కార్మిక, రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు వేలాదిగా పాల్గొనడం కార్మికుల ఐక్యతకు నిదర్శనం అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పులుసు సత్యం, సిపిఎం మండల కార్యదర్శి దేవరకొండ యాదగిరి, సిఐటియు మండల నాయకులు గుడిపురి వెంకటేశ్వర్లు, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.