30-08-2025 12:00:00 AM
జైపూర్, ఆగస్టు 29 : ఇటీవల కురిసిన వర్షాలకు, ఎగువ ప్రాంతాల నుండి వచ్చిన వరదల వల్ల గోదావరి పరివాహ ప్రాంతాలలో జలమయమైన పంట పొలాలను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ శుక్రవారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి పరిశీలించారు. మండలంలోని కిష్టాపూర్, వేలాల గ్రామాలలో వరద నీటి కారణంగా ముంపునకు గురైన పంట పొలాలను పరిశీలించి, నీట మునిగిన పంటల వివరాలు, సంబంధిత రైతుల వివరాలతో పూర్తి స్థాయి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు.
నివేదికలో అరులైన రైతుల వివరాలు మాత్రమే ఉండాలని, నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో యూరియా, ఇతర ఎరువులు సమృద్ధిగా ఉన్నాయని, కార్యచరణ ప్రకారం అందించడం జరుగుతుందని, రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని తెలిపారు.