22-08-2025 11:33:11 PM
మేడిపల్లి: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో మొబైల్ షాప్ నిర్వాహకులు మార్వాడి వ్యాపారులకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరవ్యాప్తంగా ప్రతి రంగంలో వ్యాపారాలు చేస్తున్న మార్వాడీలు వారి సంస్కృతిని మనపై రుద్దడంతోపాటు, నాసిరకం సరుకులను విక్రయిస్తూ వినియోగదారులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. గల్లీలలో పెట్టే చిన్న చిన్న దుకాణాల నుంచి హోల్సేల్ వ్యాపారులు సబ్ డీలర్లు, డీలర్లు అన్ని స్థాయిల్లో వారే వ్యాపారం నిర్వహిస్తున్నారని, స్థానికులకు వ్యాపారం చేసే అవకాశం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
మార్వాడీలు నిర్వహించే దుకాణాల్లో ఏ వస్తువులు కొన్న బిల్లు ఇవ్వరని, కొన్న వస్తువు రెండు మూడు రోజుల్లో పాడైపోయిన స్పందించరని స్థానిక వ్యాపారులు తెలిపారు. మార్వాడీలు ఒక పథకం ప్రకారం వారి వ్యాపారులను అన్ని రంగాల్లో విస్తరింపజేసి స్థానికులను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని, ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిపల్లి, బోడుప్పల్, పీర్జాదిగూడ తదితర ప్రాంతాల్లో కొత్తగా మార్వాడీలు మొబైల్ దుకాణాలు పెట్టే ప్రయత్నం చేస్తే అడ్డుకుంటామని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు.
మార్వాడీల రాకతో తెలంగాణలో కుల వృత్తులు చేసే వారి జీవితాలు సైతం ఆగమయ్యాయని, కిరాణా వ్యాపారం, బంగారు నగలు, మిఠాయి, వ్యాపారాలు, ఎలక్ట్రిక్, హార్డ్వేర్, బట్టల దుకాణాలు పూర్తిగా వారి ఆధీనంలోకి వెళ్లాయని తద్వారా స్థానిక కుల వృత్తుల వారు కనిపించకుండా పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మార్వాడీల మోసాలు దోపిడీలపై ప్రభుత్వం స్పందించి తమకు ఉపాధి రక్షణ కల్పించాలని కోరారు.