06-08-2025 12:38:06 AM
ఎస్పీ పరితోష్ పంకజ్ వెల్లడి
సంగారెడ్డి, ఆగస్టు 5: సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మొబైల్ రికవరీ మేళలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ సెల్ ఫోన్ బాదితులకు రికవరీ చేసిన ఫోన్ లను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దొంగిలించబడిన లేదా పోగొట్టుకున్న సెల్ ఫోన్ల రికవరీ కోసం గత వారం రోజుల క్రితం జిల్లా ఐటి, సైబర్ సెల్, ఎస్-న్యాబ్ సిబ్బందితో స్పెషల్ టీమ్స్ ను ఏర్పాటు చేసి ప్రత్యేక దృష్టి సారించి 259 సెల్ ఫోన్ లను రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుండి రికవరీ చేయడం జరిగందని తెలిపారు.
వాటిని మొబైల్ రికవరీ మేళా కార్యక్రమం ద్వారా బాధితులకు అందించడం జరిగిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సీఈఐఆర్ పోర్టల్ ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, ఈ పోర్టల్ ద్వారా మంచి ఫలితాలు రాబట్టడం జరుగుతుందన్నారు. సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ స్పెషల్ టీమ్స్ ఇంచార్జ్ కిరణ్ కుమార్, సైబర్ సెల్ టెక్నికల్ అసిస్టెంట్ రాజలింగం, రవి, స్నేహిత, భవానీ, హరి కృష్ణ, శ్రీహరి, ఇర్ఫాన్ అలీ, సుమ, మమత, హరీష్ ఇందిరా, జ్యోతి, సతీష్, దీపక్ తదితర ఐటి సెల్ సిబ్బంది కీలకంగా వ్యవహరించారని ఎస్పీ అభినందించారు.