calender_icon.png 22 December, 2025 | 1:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు మాక్ డ్రిల్

22-12-2025 12:05:45 AM

నేడు అరబిందో ఫార్మా కంపెనీలో మాక్ డ్రిల్

జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య

సంగారెడ్డి, డిసెంబర్ 21 :పారిశ్రామిక ప్రమాదాలపై హత్నూర మండలం బోరపట్ల వద్ద గల అరబిందో ఫార్మా లిమిటెడ్‌యూనిట్ వన్ లో ఈనెల 22న మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు. పారిశ్రామిక ప్రమాదాలు సంభవించిన సమయంలో చేపట్టాల్సిన తక్షణ చర్యలపై అధికారులు, సిబ్బంది పూర్తి స్థాయి సన్నద్ధతతో ఉండాలనే ఉద్దేశంతో ప్రయోగాత్మకంగా మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ మాక్ ఎక్సర్ సైజ్ జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ సహకారంతో నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.

పరిశ్రమల్లో ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన చర్యలు, శాఖల మధ్య సమన్వయం, సహాయక చర్యల వేగం, లోపాలు, వ్యవస్థల సామర్థ్యం, సమన్వయం వంటి అంశాలను పరిశీలించడమే ఈ మాక్ డ్రిల్ ముఖ్య ఉద్దేశమని అన్నారు. మాక్ డ్రిల్లో ప్రమాదం సంభవించినప్పుడు చేపట్టే చర్యలు, ఉద్యోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, గాయపడిన వారికి ప్రాథమిక వైద్యం అందించడం, అగ్నిమాపక చర్యలు, అంబులెన్స్ సేవలు, పోలీస్ భద్రత, రెవెన్యూ, వైద్య శాఖల సమన్వయంతో చేపట్టే సహాయక చర్యలను ప్రత్యక్షంగా ప్రదర్శించనున్నట్లు తెలిపారు. మాక్ డ్రిల్లో అగ్నిమాపక శాఖ, పోలీస్, వైద్య, రెవెన్యూ, పరిశ్రమలు, తదితర శాఖలతో పాటు అరబిందో ఫార్మా యాజమాన్యం, ఉద్యోగులు పాల్గొంటారని పేర్కొన్నారు.