22-12-2025 12:06:54 AM
* కేంద్రం తెచ్చిన విబి-జి రామ్ జి బిల్లు రద్దు చేయాలి
* మెదక్ లో బిల్లు ప్రతులు దగ్ధం
మెదక్,డిసెంబర్ 21 : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో వికసిత్ భారత్ రోజ్గార్, ఆజీవికా మిషన్ (గ్రామీణ్) బిల్లు 2025 వికలాంగుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని, కేంద్రం తీసుకువచ్చిన బిల్లు రద్దు అయ్యే వరకు ఉద్యమం చేస్తామని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం.అడివయ్య హెచ్చ రించారు. ఆదివారం వికలాంగుల హక్కుల జాతీయ వేదిక మెదక్ జిల్లా ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విబి-జి రామ్ జిబిల్లు పత్రాలను దగ్ధం చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగం, భూమిలేని, పేదరికంలో ఉన్న వికలాంగులకు, గ్రామీణ ప్రాంతంలో ఉపాధికి కల్పించెందుకు ఉపాధి హామీ పథకం వచ్చిందని అన్నారు. నిధుల కొరత, పని నిరాకరణ, డిజిటల్ హాజరు వ్యవస్థలు మరియు పని ప్రదేశాలలో సరైన సౌకర్యాలు లేకపోవడం వలన వికలాంగులలో పని చేసే వారి సంఖ్య తగ్గితుందని అన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 6,38,088 మంది వికలాంగులకు ఈ పథకం కింద ఉపాధి కల్పించబడిందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లు ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తుందని అన్నారు. గ్రామీణ ప్రాంతంలోని వికలాంగ కార్మికులకు జీవనోపాధిని మరింతగా కోల్పోయేలా చేస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వికలాంగుల ను తీవ్రమైన పేదరికంలోకి నేడుతుందని అన్నారు. బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు కె.మల్లేశం, జిల్లా కార్యదర్శి కె.యశోద, జిల్లా ఉపాధ్యక్షులు యాదగిరి, కె.కవిత, గుమ్మడిదల శ్రీనివాస్, సహాయ కార్యదర్శులు కిష్టయ్య, శ్రీనివాస్, మెదక్ పట్టణ అధ్యక్షులు శ్రీదేవి, కార్యదర్శి మున్నా, ఉపాధ్యక్షులు వెంకట్ నాయకులు సభనా, ఊసుఫోద్దీన్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.