calender_icon.png 18 August, 2025 | 7:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆధునిక మరణం

18-08-2025 12:28:48 AM

వయసు లోతుగా పారుతున్నా

అడుక్కు చేరిన

చిన్నచిన్న రాళ్ల వంటి 

కలలు కోసం

పట్టపగలే దిగులు ఈత.

కళ్ల బీడుకు నిద్ర మొలక లేక

కలత కలుపు మొక్కలను పీకే

కునుకు పలుగు కరువై

మనసంతా గుబులు గుబుర్లు

తడారిన మాటల ఎడారి కథలో

రోజుకో పాత్రతో యాతన.

మనిషిని వయసు మింగెలోపే

మనసు పీల్చి పిప్పిచేసే

ఆధునిక మరణంలో

బతుకుది అందమైన కాష్ఠం ప్రశ్న కొరివిగా జీవితంలో

ముఖానికి అద్దె బూడిదే 

అనుభవం.

కన్నీళ్లే కందెనగా కాలం

తొక్కేస్కుంటూ వెళ్లి

కల తల పగుళ్లకు

ముఖంలో రాత్రి నగ్నంగా 

తిరుగుతున్నా

నెర్రెలుబారిన హృదయ 

మైదానంలో స్రవించిన ఎన్నో పదాల పరుగుతో

పడి లేచే ఒక్కో ఊహ 

వయసు వాలుకి

వంకర టింకరగా అల్లుకుని

“ మనసు మలుపులో తొంగి చూస్తూ రాల్చే బలహీన క్షణాల

భంగపాటు ఫలాలు ఏన్నో...

గుర్తు పెట్టుకొని జ్ఞప్తికి వస్తాయి. గుర్తుకువచ్చి గుచ్చుకుంటాయి.

గతం గుర్తులు బాణాలై సంధించే వేళలో కలం కడవల కొద్దీ 

భావాలను కురిసి మనసు 

మౌన సమీరాలతో

ఉక్కపోతలో స్పృహ 

తప్పిన నిజాన్ని

మెత్తగా నిమిరిన మేల్కొలిపిన సున్నిత సుమధుర సన్నిహితాలకి స్పందించిన స్వర్గ మార్గాలలో మైమరచిన పాదాలు పల్లవి

పలికించిన భావం 

శిథిలమైనా ఊపిరే.

ముఖం తాళం వేసుకుని

మాటను దాచిపెట్టినా

ఏదో ఓ శబ్దం కనిపించి

మ్రోగే ప్రేమను మోసే మౌనాన్ని భరించే ఆనందానికి 

బాధ తప్పదేమో !

ఎన్నో కొత్త కొత్త ఆయుధాలతో

దాడి చేసే ఆలోచనకు

మనసు ఆధునిక మరణంలో

మళ్లీ మళ్లీ మూలుగుతూ

ఊపిరి పోసుకునే జీవం

ఓ నరకం రచించిన స్వర్గాన్ని

అనుభవించాల్సిందే..

 చందలూరి నారాయణరావు