09-07-2025 01:05:16 AM
మోదీకి బ్రెజిల్ అత్యున్నత పురస్కారం
అల్వోరాడా ప్యాలెస్‌లో 114 గుర్రాలతో ఊరేగింపు
బ్రాసిలియా, జూలై 8: బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ముగించుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం బ్రెజిల్ రాజధాని బ్రాసిలియాలో అడుగుపెట్టారు. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో లులాడ సిల్వా ఆహ్వానం మేరకు బ్రాసిలియాలో అడుగుపెట్టిన మోదీకి ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయంలో బ్రెజిల్ రక్షణ మంత్రి జోస్ మ్యూసియో మొంటెరో ఫిల్హో ఆయనకు స్వాగతం పలకగా..
బ్రెజిల్ సాంప్రదాయ వాయిద్యమైన సాంబా సంగీత ప్రదర్శన హైలైట్‌గా నిలిచింది. అనంతరం ఎయిర్‌పోర్టుకు భారీగా చేరుకున్న ప్రవాస భారతీయులను కలుసుకున్న మోదీ కాసేపు వారితో ముచ్చటించారు. అనంతరం దేశ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో నివాస భవనం అల్వోరాడా ప్యాలెస్‌కు చేరుకున్న మోదీకి 114 గుర్రాల ఊరేగింపుతో దేశ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో తన భార్య, బ్రెజిల్ ఫస్ట్ లేడీ జాంజా సిల్వా ఆహ్వానం పలికారు.
ఈ సందర్భంగా బ్రెజిల్ అధ్యక్షుడితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వాణిజ్యం, డిజిటల్ చెల్లింపులు, సహా విస్తృత శ్రేణి రంగాలపై మోదీ చర్చించారు. యూపీఏ పేమెంట్స్ టెక్నాలజీ సామర్థ్య నిర్మాణంలో సహాకారన్ని విస్తరించాలని నిర్ణయించినట్టు భారత విదేశాంగా శాఖ తెలిపింది. అనంతరం బ్రెజిల్ భారత ప్రధాని మోదీకి తమ దేశ అత్యున్నత పురస్కారం ‘గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదరన్ క్రాస్’ను బహుకరించారు.