calender_icon.png 14 September, 2025 | 1:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్మ ఊరెళ్లింది.. ఇక రాదు

16-12-2024 01:23:56 AM

  • అన్నయ్య హాస్పిటల్‌లో ఉన్నాడు
  • కన్నీళ్లు తెప్పిస్తున్న రేవతి కూతురు శాన్విక మాటలు

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 15 (విజయక్రాంతి): అమ్మ ఊరికి వెళ్లింది.. ఇక రాదు.. అని అమాయకత్వంతో ఆ చిన్నారి చెప్పిన మాటలు అందరికీ కన్నీళ్లు తెప్పించాయి. పుష్ప ప్రీమియర్ షో సందర్భం గా ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మరణించిన రేవతి కూతురు శాన్విక మాటలు గుండెల్ని పిండేస్తున్నాయి. ఈ ఘటనలో ఆమె కుమారుడు సైతం ప్రాణపాయ స్థితిలో ఉన్న విషయం తెలిసిందే.

ఈ క్రమం లో ఆదివారం ఓ టీవీ ఛానల్ ప్రతినిధి అడిగిన ప్రశ్నలకు చిన్నారి శాన్వి తన చిట్టిపొట్టి మాటలతో సమాధానం చెప్పింది. ‘అమ్మ రోజూ నాకు, అన్నయ్యకు అన్నం తినిపించేది, బాగా చదువుకోవాలని, స్కూల్‌కి, ట్యూషన్‌కు తప్పకుండా వెళ్లాలని చెప్పేది’ అని ఆ చిట్టితల్లి చెప్తుంటే చూసినవాళ్లకు కన్నీళ్లు ఆగడం లేదు. అన్నయ్య ఇంటికి వచ్చాక ఇద్దరం కలిసి స్కూల్‌కి వెళ్తామంటూ చెప్పిన ముద్దు ముద్దు మాటలు చూపరులను భావోద్వేగానికి గురి చేస్తున్నాయి.