18-09-2025 12:40:49 AM
-డిప్యుటేషన్ పట్ల డీఈవో పై కలెక్టర్ ఆగ్రహం ఉత్తదేనా..?
- యధావిధిగా డిప్యుటేషన్ కొనసాగించాలని ఉత్తర్వులు.
నల్లగొండ టౌన్, సెప్టెంబర్ 17(విజయ క్రాంతి): మా ప్రధానోపాధ్యాయురాలుని మా పాఠశాలకు పంపించాలని, పాఠశాలకు ఉన్న ఇద్దరు ఉపాధ్యాయులలో ఒకరిని డిప్యూటేషన్ వేయడం వల్ల ఓకే ఉపాధ్యాయునితో ఇబ్బందిగా ఉందని గత సోమవారం జరిగిన గ్రీవెన్స్ డే లో ఆ పాఠశాలకు చెందిన విద్యార్థినిలు, వారి తల్లిదండ్రులు గ్రామస్తులతో జిల్లా కలెక్టర్ ను కలిసి తమ గోడును వెల్లబుచ్చారు. వెంటనే జిల్లా కలెక్టర్ డీఈఓ బిక్షపతి ని పిలిపించి ఉపాధ్యాయురాలిని ఎందుకు డిప్యూటేషన్ వేశామని ప్రభుత్వం నియమించిన చోట కాకుండా మీరు ఎందుకు ఆమెను పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వెంటనే ఆమె డిప్యూటేషన్ రద్దుచేసి యధావిధిగా కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు. మాకు న్యాయం జరిగిందని ఆశించిన ఆ విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తూ తమ గ్రామానికి చేరుకునే లోపే నిరాశ ఎదురైంది. ఆ ఉన్నత అధికారి వెంటనే సాయంత్రం వరకే డిప్యూటేషన్ రద్దు చేసి ఉపాధ్యాయురాలిని యధావిధిగా కొనసాగించాలని విద్యాశాఖ అధికారులకు మరో జీవో జారీ చేయడంతో ఆ విద్యార్థులు, ఆ గ్రామ ప్రజలు ఒక్కసారి అవ్వక్కయ్యారు.ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కేవలం ప్రచారం కోసమేనా అన్న అనుమానాలను అన్ని వర్గాల ప్రజలు లేవనెత్తుతున్నారు.
ప్రజావాణిలో కలెక్టర్ తీసుకున్న నిర్ణయాన్ని ఆమే వెనక్కి తీసుకోవడంతో తమ బాధ ఇంకెవరితో చెప్పుకోవాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 8 వ తేదీన నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో తమ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాల్సి ఉండగా ప్రధానోపాధ్యాయు రాలు రోహిణి ని అక్రమంగా మునుగోడు మండలం పులిపలుపుల పాఠశాలకు డిప్యూటేషన్ వేశారని వెంటనే ఆ డిప్యూటేషన్ ను రద్దు చేయాలని పాఠశాలకు చెందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలెక్టర్ ఇలా త్రిపాఠి ని కలిసి ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఆమె అక్కడే ఉన్న డీఈవో బొల్లారం బిక్షపతి ని మందలించి వెంటనే రోహిణి డిప్యూటేషన్ ను రద్దు చేయాలని ఆదేశించింది.
దీంతో డీఈవో బిక్షపతి 9వ తేదీన రోహిణి డిప్యూటేషన్ రద్దు చేస్తూ ప్రొసీడింగ్ నెంబర్ 3327/బి / 2 ను జారీ చేశారు. ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని ఎవరి నుండి ఒత్తిడి వచ్చిందో ఏమో కానీ అదే రోజు కలెక్టర్ ఆదేశాలతో డీఈవో బిక్షపతి సాయంత్రం పూట రోహిణి డిప్యూటేషన్ రద్దు చేస్తూ జారీ చేసిన ప్రొసీడింగ్ నెంబర్ 3327/ బి /2 ను అబెన్స్ లో పెడుతూ రోహిణి ని పులిపలుపుల పాఠశాలలోనే విధులు నిర్వహించాలని, నరసింహులు గూడెం పాఠశాలలో రోహిణి స్థానంలో వేరే ఉపాధ్యాయుడిని అడ్జస్ట్ చేయాలని నాంపల్లి ఎంఈఓ కు ఉత్తర్వులు జారీ చేస్తూ డీఈవో ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు ఇది వివాదాస్పదమైంది.
విద్యా వ్యవస్థను గాడిలో పెట్టాలన్న సదుద్దేశంతో ప్రభుత్వం ఈ సంవత్సరం టీచర్ల అడ్జస్ట్మెంట్ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించింది. అయినా కూడా రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో ఉపాధ్యాయులు తమకు అనుకూలంగా ఉన్న చోటికి డిప్యూటేషన్ వేయించుకోవడం సాధారణమైంది. జిల్లా విద్యాశాఖలో జరుగుతున్న అక్రమ డిప్యూటేషన్లను రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు, చివరికి విద్యార్థులు కూడా కలెక్టర్ కు విన్నవించినా ప్రజా ప్రతినిధుల బలం ముందు విజ్ఞాపనలు పనికిరాకుండా పోతున్నాయి.