19-07-2025 12:00:54 AM
రోడ్డుపైన కాదు.. గల్లీల్లో తిరగాలి
అప్పుడే చిత్తశుద్ధి తెలుస్తది
బీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి మల్లికార్జునరెడ్డి
హుస్నాబాద్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ లోని అన్ని వార్డుల్లో పర్యటించాలని, కేవలం ప్రధాన రహదారుల్లో చేసే మార్నింగ్ వాక్‌లతో పూర్తి స్థాయిలో సమస్యలను తెలుసుకోలేరని బీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. "మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పట్టణంలోని అన్ని వార్డుల్లో తిరిగితే ప్రజలు ఎన్ని సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారో తెలుస్తుంది" అని అన్నారు.
కొంత సమయం దొరికిందని నామ్ కే వాస్తేగా పట్టణంలోని మెయిన్ రోడ్లలో మార్నింగ్ వాక్ చేస్తే కేవలం ఫొటోలు, ప్రచారమే తప్ప ప్రజా సమస్యలు పరిష్కారం కావన్నారు. పట్టణంలో అభివృద్ధి పనుల కోసం చేసిన శంకుస్థాపన పనులు కొన్ని వార్డుల్లో ఇంకా ప్రారంభం కాలేదని, మరికొన్ని వార్డుల్లో వేసిన సీసీ రోడ్లు నాణ్యత లేకుండా ఉన్నాయని ఆయన ఆరోపించారు. డ్రైనేజ్‌లు సరిగా లేవని, కోట్లాది రూపాయలతో నిర్మించిన రైతు బజార్ ప్రారంభించినా అది ప్రజలకు అందుబాటులోకి రాలేదని ఎత్తి చూపారు.
కొన్ని వార్డుల్లో రోడ్లు బాగాలేని పరిస్థితి ఉందని, వేసిన రోడ్లు చెడిపోయి ప్రజలు తిరగడానికి ఇబ్బందులు పడుతున్నారన్నారు. అనేక మంది పేద ప్రజలకు సొంత ఇల్లు లేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలోని ప్రజల సమస్యల పరిష్కారం కోసం మంత్రి అన్ని వార్డుల్లో పర్యటించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆయన మార్నింగ్ వాక్ ప్రజల కోసం కాదని, ఆయన ఆరోగ్యం, కాలక్షేపం, ఫొటోల ప్రచారం కోసమేనని భావించాల్సి వస్తుందన్నారు.