19-07-2025 12:00:00 AM
బ్యాంకులు, ఏటీఎం ల భద్రతపై అధికారులతో సమీక్ష నిర్వహించిన బాన్సువాడ డీఎస్పీ బి విఠల్ రెడ్డి
బాన్సువాడ జులై 18 (విజయ క్రాంతి): బ్యాంకుల భద్రత కోసం అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని బాన్సువాడ డీఎస్పీ బి.విఠల్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని డిఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ బి. విఠల్ రెడ్డి వివిధ బ్యాంకులకు చెందిన అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంకులు, ఏటీఎంల పరిసరాలను అన్ని వైపుల నుండి కవర్ చేసే విధంగా సీసీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. ఏర్పాటు చేసిన కెమెరాలు నిరంతరం సక్రమంగా పనిచేసేలా చూసుకోవాలని సూచించారు.చోరీ ప్రయత్నాలను గుర్తించేలా బ్యాంకులు, ఏటీఎంలలో అలారం వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.
ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు తక్షణమే పోలీసులను సంప్రదించేందుకు వీలుగా స్థానిక పోలీసు అధికారుల నెంబర్లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.బ్యాంకులు, ఏటీఎంల వద్ద భద్రతా సిబ్బందిని నియమించుకునేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ప్రజల సొమ్ము, భద్రతకు బ్యాంకుల అధికారులు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, పోలీసులతో సమన్వయం చేసుకుంటూ నేరాలను అరికట్టడంలో సహకరించాలని కోరారు.ఈ సమావేశం లో పట్టణ సీఐ యం. అశోక్, బ్యాంక్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.