11-09-2025 01:03:34 AM
మరమ్మత్తులకు నోచుకోని పాగింగ్ యంత్రాలు పట్టించుకోని అధికారులు
కల్వకుర్తి సెప్టెంబర్ 10: కల్వకుర్తి మున్సిపాలిటీలో మురుగునీటి వ్యవస్థ పూర్తిస్థాయిలో లేకపోవడం, నూతన కాలనీలలో ఖాళీ స్థలాలు అధికంగా ఉండటం వర్షాకాలం పిచ్చి మొక్కలు అధికంగా పెరిగి దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయి.
కాసేపు ఆరు బయట సేద తీరుదామంటే ఉండలేని పరిస్థితి నెలకొంది. దోమకాటు గురై అనేకమంది చిన్నారులు , వృద్ధులు అనారోగ్య బారిన పడుతున్నారు. వాటి నివారణకు మున్సిపాల్టీలలో లక్షల రూపాయలు ఖర్చు చేసి పాగింగ్ యంత్రాలు కొనుగోలు చేసినప్పటికీ వాటి వినియోగం మాత్రం నామ మాత్రంగానే ఉంది. చిన్న చిన్న సమస్యలున్నా పట్టించుకోకపోవడంతో వాటిని పక్కన పెడుతున్నారు.
పెరుగుతున్న రోగుల సంఖ్య..
రోజురోజుకు ఆస్పత్రుల్లో రోగుల సంఖ్య పెరుగుతుంది. సీజనల్ వ్యాధులకు తోడుగా దోమకాటుతో మలేరియా బారిన పడి చిన్నారులు వృద్ధులు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. దోమల నివారణకు ఇండ్లలో రసాయనాలతొ తయారు చేసిన కాయిల్స్ వాడటం వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు.
అయినప్పటికీ మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు. జిల్లాలోని కల్వకుర్తి 2, అచ్చంపేట 2, కొల్లాపూర్ 1, నాగర్ కర్నూల్ 2 పాగింగ్ యంత్రాలు ఉన్నప్పటికి ఎక్కడ వాటిని ఉపయోగించడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దోమల నివారణకు పాగింగ్ చేయాలని ప్రజలు కోరుతున్నారు.
వినియోగంలోకి తెస్తాం..
పాగింగ్ యంత్రాలు మరమ్మతులు చేయించి వెంటనే వినియోగంలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. దోమల నివారణకు ఎక్కడ మురుగునీరు నిల్వ లేకుండా చూస్తున్నాం.
శివ. సానిటరీ ఇన్స్పెక్టర్, కల్వకుర్తిమున్సిపాలిటీ.