calender_icon.png 18 August, 2025 | 8:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశ భాషలకు తల్లి

09-08-2025 12:00:00 AM

నేడు ప్రపంచ సంస్కృత భాషా దినోత్సవం :

ఇండో- -యూరోపియన్ మాండలికాల నుంచి ఆవిర్భవించిన అతిపురాతన భాష సంస్కృతం. హిందూ సమాజ ఆదరణ, ఆధ్యాత్మిక భావనలకు ప్రతిరూపంగా కొనసాగుతోంది. వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలకు నెలవుగా సంస్కృతం పేరు గాంచింది. భారతీయ నాగరికతతో విడదీయరాని బంధాలను పెనవేసుకున్న సంస్కృత భాషా ప్రాధాన్యాన్ని, ప్రయోజనాలను, పునరుజ్జీవన ప్రయత్నాలను, రేపటి తరానికి భాషా రుచిని పరిచయం చేయడం కోసం ప్రతి ఏటా ఆగస్టు 9న ‘ప్రపంచ సంస్కృత భాషా దినోత్సవం’ నిర్వహిస్తున్నారు.

‘విశ్వ సంస్కృత దివస్’ పాటించడం 1969 నుంచి ఆనవాయితీగా వస్తోంది. భారత్‌లో రాఖీ పౌర్ణమి రోజున ప్రపంచ సంస్కృత దినం జరుపుకోవడం పరిపాటి. ప్రముఖ సంస్కృత పండితుడు, వ్యాకరణకర్త పాణిని జన్మదినం సందర్భంగా ప్రపంచ సంస్కృత దినోత్సవం జరుపుకోవడం ముదావహం. అత్యంత పురాతనమైన సంస్కృత భాషకు ప్రత్యేక లిపి ఇతర భాషల నుంచి ఉద్భవించింది.

పాణిని, కాళిదాసు, పతంజలి, వేదవ్యాసుడు, ఆదిశంకరాచార్యుడు లాంటి ప్రముఖులు సంస్కృత భాషకు పట్టం కట్టిన వ్యక్తులుగా నిలిచిపోయారు. అన్ని భారతీయ భాషలకు తల్లిలాంటి సంస్కృతాన్ని ‘దేవతల భాష’గా కూడా పిలుస్తున్నారు. దాదాపు 3500 ఏండ్ల క్రితం భారతదేశంలో పుట్టిన సంస్కృతాన్ని దేవతల భాషగా పిలుస్తాం. సంస్కృత భాషను కంప్యూటర్ సైన్స్, తత్వశాస్త్రం, ఆధ్యాత్మికత, గణితం, మత సంప్రదాయాలు, సాహిత్యం, సైన్స్, కళల అభివృద్ధికి ఉపయోగించడం సంతోషదాయకం.

సంస్కృత భాష నుంచి ఎన్నో ప్రఖ్యాత నినాదాలు పుట్టడమే కాక ప్రజాదరణను సొంతం చేసుకున్నాయి. ‘సర్వేజన సుఖినో భవంతు’ (అందరూ సంతోషంగా ఉండాలి), ‘విద్యా దదాతి వినయం’ (జ్ఞానం వినయాన్ని ఇస్తుంది), ‘లోకః సమస్తాః సుఖినో భవంతు’ (అన్ని లోకాల జీవులు సంతోషంగా ఉండాలి) లాంటి ఎన్నో ప్రఖ్యాత నినాదాలున్నాయి. కంప్యూటర్ సైన్స్, కృత్రిమ మేధ, డిజిటల్ భాషాశాస్త్రంలో సంస్కృతం పాత్ర వెలకట్టలేనిది.

ప్రపంచ సంస్కృత దినం రోజున విద్యాలయాల్లో సంస్కృత శ్లోకాల పఠనం, వ్యాసరచన, ఉపన్యాస, పెయింటింగ్, డ్రాయింగ్ పోటీలను నిర్వహించవచ్చు. అదే విధంగా సెమినార్లు, వెబినార్లు, కార్యశాలలు, ప్రవచనాలు లాంటి కార్యక్రమాలను కూడా నిర్వహించవచ్చు. విద్యార్థులు, యువత, భాషావేత్తలు, ఉపాధ్యాయులు, భాషా సంఘాలు చేయి చేయి కలిపి సంస్కృత పునర్‌ఃవైభవానికి కృషి చేస్తూ, మన భాషా తల్లిని ప్రపంచ మానవాళికి రుచి చూపే ముమ్మర ప్రయత్నాలు చేయాలి.

 డాక్టర్ బుర్ర మధుసూదన్‌రెడ్డి 

వ్యాసకర్తసెల్: 9949700037