09-08-2025 12:00:00 AM
భారత్‌పై 25 శాతం టారిఫ్, మరో 25 శాతం పెనాల్టీలు అంటూ మొత్తం 50 శాతం సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఏకంగా రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలను అర్ధాంతరంగా నిలిపివేశారు. అమెరికా అధ్యక్షునిగా రెండోసారి గెలిచినప్పటి నుంచి ట్రంప్, దేశాన్ని ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు తీసుకున్న పలు చర్చల్లో అమెరికాతో వాణిజ్యం చేస్తున్న దేశాల ఎగుమతులపై సుంకాలు పెంచడం ప్రధానమైంది.
సుంకాల పెంపుదల అంశాన్ని ట్రంప్ తన విదేశాంగ విధానానికి ముడిపెట్టడం తీవ్ర విమర్శలకు కారణమవుతున్నది. ఈ దిశగా ట్రంప్, అమెరికా దౌత్య సంబంధాలను కూడా పణంగా పెట్టేందుకు సిద్ధం కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న అంశం. రష్యా- ఉక్రెయిన్ యుద్ధాన్ని అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత మొదటి రోజే ఆపేలా చేస్తానని ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రకటించిన ట్రంప్, ఆ విషయంలో ఘోరంగా విఫలమయ్యారు.
ఆ ఆక్రోషాన్ని ఆయన భారత్‌పై మరోలా చూపుతూ వచ్చారు. రష్యా నుంచి భారత్ బహిరంగ విఫణిలో కంటే తక్కువ ధరకు చమురు దిగుమతి చేసుకోవడం అమెరికాకు నచ్చడం లేదు. తన మాట వినని రష్యాతో మీరు అన్ని సంబంధాలు తెగదెంపులు చేసుకోవాలని ట్రంప్, భారత్‌ను శాసిస్తున్నారు. ఇక వాణిజ్య ఒప్పందంలోని అంశాలన్నా భారత్‌కు మేలు చేసేవిగా ఉన్నాయా అంటే అదీ లేదు.
దేశ వ్యవసాయ రంగాన్ని, ముఖ్యంగా పాడి పరిశ్రమను అమెరికా బహుళజాతి కంపెనీలకు బార్లా తెరవాల్సిందేననే షరతులు భారత్ సార్వ భౌమాధికారాన్ని సవాలు చేస్తున్నట్లుగా వున్నాయి. అలాంటి వాణిజ్య ఒప్పందానికి ససేమిరా అంటున్న భారత్‌పై ట్రంప్ మండిపాటు మొద లైంది. వివిధ దేశాలపై విధించిన సుంకాల పెంపు అమలు మొదలై అమెరికా ఖజానా నిండుతుండటం ట్రంప్‌కు ఆనందాన్ని కలిగిస్తున్నది.
ఏడాదిలో అమెరికా పెంచిన సుంకాలతో 300 బిలియన్ డాలర్ల రెవెన్యూ రావొచ్చని అంచనా. అమెరికన్లకు ఇది మంచి పరిణామమే కావచ్చు. పెరిగిన సుంకాలతో దిగుమతి అయిన వస్తువుల ధరలు పెరిగితే వారు ట్రంప్‌ను దూషించ నూవచ్చు. సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు నెలరోజులుగా అనుసరిస్తున్న విధానం, ఆ దేశంతో ఇప్పటి వరకు స్నేహ సంబంధాలను కొనసాగిస్తున్న భారత్‌ను ఆలోచనలో పడేసిందనే చెప్పాలి.
రష్యా నుంచి చమురు, ఆయుధాలు కొనుగోలు చేస్తున్న భారత్, తన చిరకాల మిత్రదేశానికి మరింత దగ్గర కానుంది. రష్యాలో పర్యటించిన భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్ దేశాధ్యక్షుడు పుతిన్‌తో సమావేశం కావడం కీలకమైన పరిణామం. పుతిన్ త్వరలోనే భారత పర్యటనకు రానున్నట్టు దోవల్ ప్రకటించారు. భారత చమురు దిగుమతుల్లో రష్యా నుంచే 36 శాతం దిగమతి జరుగుతుండటం గమనార్హం.
ప్రస్తుత పరి స్థితుల్లో ట్రంప్ విధించిన సుంకాలు, వ్యవహరించిన తీరు.. రష్యా, చైనాలకు భారత్ మరింత దగ్గరయ్యే అవకాశం ఉంది. దీనితో దక్షిణా సియాలో దేశాల విదేశాంగ విధానాల్లో గణనీయ మార్పులు రావచ్చు. ఈ దేశాలపై అమెరికా ప్రభావం అంతకంతకూ తగ్గి కొత్త సమీకరణలకు మార్గం సుగమం కావచ్చు.