29-01-2026 12:39:35 AM
అంబరాన్ని తాకిన జిల్లా స్థాయి క్రీడా, సాంస్కృతిక వేడుకలు
ఆదిలాబాద్, జనవరి 28 (విజయక్రాంతి): జిల్లా స్థాయి బాలికల స్పోరట్స్ అండ్ కల్చరల్ మీట్ ప్రేరణ ప్రారంభోత్సవ వేడుకల సంబరాలు అంబరాన్ని తాకాయి. బుధవారం బోథ్‌లోని సోషల్ వెల్ఫేర్ పాఠశాల క్రీడా ప్రాంగణంలో మూడు రోజుల పాటు చేపట్టిన ఈ వేడుకలను కలెక్టర్ రాజార్షి షా ఘనంగా ప్రారంభించారు. ముందుగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఎస్పీ అఖిల్ మహ జన్ గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు మల్లెపూల నర్సయ్య, ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి యువరాజ్ మర్మాట్‌తో కలిసి పాల్గొన్న కలెక్టర్ క్రీడాజ్యోతిని వెలిగించి, జాతీయ పతాకంతో పాటు క్రీడా పతాకాలను ఆవిష్కరించారు. అనంతరం అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. విద్యార్థుల గౌరవ వందనం స్వీకరించారు.
ప్రారంభోత్సవంలో విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ... ఈ ప్రాంతానికి చెందిన విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ చూపడం గర్వకారణమన్నారు. ప్రతి విద్యార్థిని క్రీడా స్ఫూర్తితో పాల్గొని తన ప్రతిభను నిరూపించుకోవాలని సూచించారు. అంతకుముందు కలెక్టర్ మాట్లాడుతూ... సంక్షేమ పాఠశాలల విద్యార్థినుల ప్రతిభను ప్రశంసిస్తూ, క్రీడల్లో గెలుపోటములకంటే భాగస్వామ్యమే ముఖ్యమని తెలిపారు. ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ... క్రీడలు క్రమశిక్షణకు నిలువెత్తు ఉదాహరణలని అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ క్రీడాకారిణి నందిని, అదనపు కలెక్టర్లు శ్యామలదేవి, రాజేశ్వర్‌రావు పాల్గొన్నారు.