25-07-2024 12:00:00 AM
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేయని గ్రామం లేదు. అలాంటి వాటిలో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది నిర్మల్ మండలంలోని బొప్పారం గ్రామం. ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్న సమయంలో గ్రామమంతా ఏకమై.. గ్రామ నడిబొడ్డుపై తెలంగాణ సాధనకు అఖండ జ్యోతి వెలిగించారు. అఖండ జ్యోతి దాదాపు 1,603 రోజులు, 24 గంటల పాటు ఆరిపోకుండా కంటికి రెప్పలాగ చూసుకున్నారు గ్రామస్తులు. స్వరాష్ట్రం వచ్చిన వెంటనే పెద్దఎత్తున ఊరేగింపుతో అఖండ జ్యోతిని గోదావరి నదిలో నిమర్జనం చేశారు. ఆనాటి ఉద్యమ జ్ఞాపకాలను విజయక్రాంతితో పంచుకున్నారు జేఏసీ నాయకులు, బొప్పారం గ్రామస్తులు. ఆ విశేషాలేంటో చూసేయండి..
2009 సంవత్సరం తెలంగాణ కోసం ఉద్యమం ప్రారంభమైంది. ఇప్పుడు కాకుండా తెలంగాణ ఎప్పుడొస్తుందని ప్రజలంతా జేఏసీగా ఏర్పడి ఉద్యమబాట పట్టారు. నిర్మల్ మండలంలోని బొప్పారం గ్రామం జేఏసీగా ఏర్పడి ఉద్యమ పోరును అందుకుంది. 2009 సంవత్సరంలో గ్రామంలోని యువకులు, వీడీసీ సభ్యులు, మేధావులు, ఉద్యోగులు, ఎన్‌ఆర్‌ఐలు జేఏసీగా ఏర్పడ్డారు. మొత్తం 56 మందితో కమిటీ ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రం కోసం జేఏసీ పిలుపు ఇచ్చినా దాన్ని గ్రామంలో అమలు చేయడానికి నిర్ణయించుకున్నారు. ఇందు లో భాగంగానే ఉద్యమంలో రిలే నిరాహార దీక్షలు, మానవహారం, సహాయ నిరాకరణ అంటూ ఉద్యమాలు చేపట్టిన జేఏసీ ఆ స్ఫూర్తిని చాటుతూ 2010, ఫిబ్రవరి ఎనిమిదిన అఖండ జ్యోతిని ప్రారంభించింది.
జ్యోతిని వెలిగిచి తెలంగాణ వచ్చే వరకు దీన్ని ప్రతిరోజూ వెలిగించాలని తీర్మానం చేసుకుంది. దీనికి రాజకీయ రంగు లేకుండా పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న స్రవంతి అనే చిన్నారితో దీపం వెలిగించి అఖండ జ్యోతి కార్యక్రమాన్ని నిర్వహించింది. అప్పటి నుంచి గ్రామంలో జేఏసీతో పాటు గ్రామస్థులు తెలంగాణ కోసం పోరాటం చేస్తూ రాష్ట్ర కమిటీ ఏ పిలుపునిచ్చినా ఆ గ్రామంలో అమలు చేసింది. 24 గంటల అఖండ జ్యోతిని వెలిగించడం, జేఏసీ కార్యక్రమాలను అమలు చేసేందుకు జేఏసీ కన్వీనర్‌గా ఓజ స్వామిని నియమించారు. మరో ఐదుగురు సభ్యులతో కలిసి అఖండ జ్యోతి నిర్వహణ బాధ్యతను చేపట్టారు.
అఖండ జ్యోతికి మంచి గుర్తింపు..
2009లో ప్రారంభమైన తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఊరు, వాడ ఏకమై పోరుబాట పట్టింది. వల్మల్, బొప్పారం గ్రామంలో ఉద్యమాల్లో పాల్గొంటూనే 24 గంటల అఖండ జ్యోతిని వెలిగించిన జేఏసీ దాన్ని తెలంగాణ వచ్చే వరకు ఆరిపోకుండా కంటికి రెప్పలా కాపాడారు. గ్రామానికి చెందిన హోటల్ నిర్వాహకుడు రేగుంట రమేశ్ స్వచ్ఛందంగా ప్రతిరోజూ దీపానికి వత్తులు, నూనె వేసి నిర్వహణ బాధ్యతను చూశారు. దీనికి అయ్యే ఖర్చును గ్రామానికి చెందిన జేఏసీ సభ్యులతో పాటు ఉద్యమకారులు భరించారు. ఈ అఖండ జ్యోతి 1,603 రోజుల పాటు నిరంతరంగా వెలిగింది. 2009 నుంచి 2014 వరకు తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు గ్రామంలో ధూంధాం కార్యక్రమాలు నిర్వహించారు.
ఇందులో భాగంగానే గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశారు. దీనికయ్యే ఖర్చును జేఏసీ కమిటీ సభ్యులు, ఉద్యమకారులు భరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో అప్పటి ఉద్యమకారులు దేశపతి శ్రీనివాస్, రసమయి బాలకిషన్, కోదండరాం, హరీశ్‌రావు, శ్రీధర్ దేశ్‌పాండే వంటి ఉద్యమ నేతలతో పాటు కళాకారులు, జేఏసీ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అఖండ జ్యోతి స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ కొనియాడారు. గ్రామానికి చెందిన కళాశాల అధ్యాపకులు జయప్రకాశ్ అఖండ జ్యోతి స్ఫూర్తిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో అది పార్లమెంట్‌లో చర్చకు దారితీసినట్లు గ్రామస్థులు తెలిపారు. దీంతో విశ్వవ్యాప్తంగా బొప్పారం అఖండ జ్యోతి విషయం తెలియడంతో ఉద్యమ ఉధృతి మరింత పెరిగింది. అలా ఉద్యమ తీవ్రంగా నడుస్తున్న సమయంలోనే కేంద్ర ప్రభుత్వం జూన్ 2, 2014లో తెలంగాణ రాష్ట్రాన్ని అధికారికంగా ప్రకటించారు.
తెలంగాణ వచ్చిన తర్వాతే నిమర్జనం..
బొప్పారం గ్రామంలో 2009లో ప్రారంభమైన అఖండ జ్యోతి 1,603 రోజులు నిర్విరామంగా వెలిగింది. తెలంగాణ రాష్ట్రం ప్రకటించడంతో గ్రామంలో జేఏసీ సభ్యులు అఖండ జ్యోతికి గుర్తింపుగా గ్రామంలో స్మారక స్థూపాన్ని నిర్మించారు. ఆంధ్రాకు చెందిన మేస్త్రి వెంకటేశ్వర్లు ఈ స్థూపాన్ని ఉచితంగా చేశారు. జ్యోతిని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆర్పేయాలని నిర్ణయించారు. అదేరోజు గ్రామంలో జేఏసీ సమావేశం నిర్వహించి గ్రామస్తులదరూ 1,603 రోజులు వెలిగించిన దీపాన్ని ఊరేగింపుగా గోదావరి నది వరకు ఉద్యమ ర్యాలీని నిర్వహించి గోదావరిలో పూర్ణాహుతి పూజలు చేసి సంప్రదాయ పద్ధతిలో దీపాన్ని వదిలిపెట్టారు.
దీంతో అఖండ జ్యోతి ప్రస్థానం ముగిసింది. దానికి చిహ్నంగా గ్రామంలో స్మారక స్తూపాన్ని ఏర్పాటు చేశారు. అయితే 1,603 రోజుల పాటు అఖండ జ్యోతిని ప్రాతినిధ్యం వెలిగించిన రేగుంట రమేశ్ 2019, జనవరి 21న మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత తనకు గుర్తింపు నివ్వాలని దీపం వెలిగించిన రమేశ్ తో పాటు జేఏసీ కన్వీనర్ ఓజ స్వామి ప్రభుత్వానికి విన్నవించుకున్నా అప్పటి కలెక్టర్ జగన్‌మోహన్ ప్రశంశ పత్రాన్ని అందించారు. కానీ కుటుంబానికి ఏ సహాయం అందించకపోవడం వారిని నిరాశకు గురిచేస్తున్నది.
గాజుల రామేశ్వర్,
నిర్మల్, (విజయక్రాంతి)
కుటుంబాన్ని ఆదుకోవాలి!
మాది మధ్యతరగతి కుటుంబం. పొద్దంతా హోటల్ నిర్వహించే వాళ్లం. గ్రామంలో అఖండ జ్యోతి వెలిగించే బాధ్యతను మా ఆయన రేగుంట రమేశ్ తీసుకున్నారు. 2009 నుంచి 2014 వరకు దీపాన్ని ఆరకుండా నిర్వహించాం. నూనె, వత్తులు, రక్షణ కోసం కంటికి రెప్పలా కాపాడుకున్నాం. ఆయన మరణం తర్వాత సాయం చేస్తామన్న అప్పటి నేతలు ఇప్పటి వరకు ఏ సాయం చేయలేదు. ప్రభుత్వం ఇచ్చే వృద్ధాప్య పింఛన్‌తోనే బతుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇంటి స్థలం, రూ.5 లక్షల ఆర్థికసాయం ప్రకటించింది. దాన్ని మా కుటుంబానికి అందించి ఆదుకోవాలి.
రేగుంట చిన్నక్క
అందరి సహకారంతో..
2009లో మా గ్రామంలో విద్యావంతులు, మేధావులు, వీడీసీ కమిటీ సభ్యులు, ఎన్‌ఆర్‌ఐలతో కలిసి జేఏసీగా ఏర్పడ్డాం. 2010లో అఖండ జ్యోతిని ప్రారంభించి 2014 వరకు కొనసాగించినం. తెలంగాణ రాష్ట్రం కోసం జేఏసీ ఏ పిలుపునిచ్చినా మా గ్రామంలో ఆ ఉద్యమంలో పాల్గొనడం వల్ల మా గ్రామానికి మంచి గుర్తింపు వచ్చింది. బొప్పారంలో వెలిగించిన అఖండ జ్యోతి విశ్వవ్యాప్తం కావడంతో మా గురించి అందరికీ తెలిసింది. అయినప్పటికీ జేఏసీ కన్వీనర్‌గా 1603 రోజుల పాటు బాధ్యతలు నిర్వర్తించిన నాకు ప్రభుత్వం నుంచి గుర్తింపు తప్ప ఏ సాయం అందలేదు. ప్రస్తుతం కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ఉద్యమకారులను ఆదుకుంటే బాగుంటుంది.
ఓజ స్వామి, జేఏసీ కన్వీనర్