calender_icon.png 18 May, 2025 | 5:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర నిధులు ఏం చేశారు?

17-05-2025 11:38:16 PM

300 కోట్లు ఎక్కడ అని ప్రశ్నించిన ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్..

హైదరాబాద్ (విజయక్రాంతి): రాష్ట్రంలో ఆదివాసులు, గిరిజనుల కోసం కేంద్ర ప్రభుత్వం సుమారు రూ. 300 కోట్లు విడుదల చేసినా.. ప్రభుత్వం గత ఆరు నెలలుగా ఆ నిధులను జిల్లాలకు పంపకుండా, గిరిజనులకు అందకుండా నిలిపివేసిందని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్(MP Godam Nagesh) ఆరోపించారు. ఈ నిధులను ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.

పేద గిరిజనులకు అందాల్సిన ఈ నిధులను కాంగ్రెస్ సర్కారు మళ్లించిందనే అనుమానం కలుగుతోందని, కొలాంస్, తొటి, చెంచు గిరిజనులు గత ఏడాది నుంచే అప్పులు తీసుకుని ఇండ్ల నిర్మాణాలు చేపట్టారని... కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులను ఇప్పటికీ విడుదల చేయలేదన్నారు. విద్యా సంవత్సరం ముగిసినప్పటికీ, గిరిజన విద్యార్థులకు ఇవ్వాల్సిన స్కాలర్‌షిప్‌లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్‌లోనే నిధులను విడుదల చేసిందన్నారు. ఆర్టికల్ 275(1) కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో రెసిడెన్షియల్ స్కూల్స్, ఆశ్రమ పాఠశాలలను అభివృద్ధి చేసి విద్యా వ్యవస్థలో మౌలిక మార్పులు తీసుకురావాలని నగేష్ డిమాండ్ చేశారు.