calender_icon.png 18 May, 2025 | 9:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మినీ అంగన్వాడీ టీచర్ల సమస్యలను పరిష్కరించాలి

18-05-2025 12:00:00 AM

--ప్రభుత్వానికి రాష్ట్ర మినీ అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి 

ఖైరతాబాద్; మే 17 (విజయ క్రాంతి) : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న మినీ అంగన్వాడి టీచర్ల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర మినీ అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

ఈ మేరకు శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ల ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆడెపు వరలక్ష్మి, రేణుకలు మాట్లాడారు.. బాల బాలికల సంక్షేమం కోసం 2007 సంవత్సరంలో అప్పటి కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు మినీ అంగన్వాడీ టీచర్లను నియమించారని అన్నారు.

ఈ మినీ అంగన్వాడీ టీచర్లు మెయిన్ అంగన్వాడీ టీచర్ల మాదిరిగానే పనిచేస్తూ గర్భిణీలు, బాలింతలకు, ప్రీస్కూల్ చిన్నారులకు వంట చేసి పెట్టే అనేక కార్యక్రమాలలో భాగస్వాములుగా ఉన్నారని అన్నారు. మినీ అంగన్వాడీ టీచర్లను ప్రభుత్వం గుర్తించకపోగా మెయిన్ అంగన్వాడీలలో హెల్పర్లకు ఇచ్చే జీతం 7800 రూపాయలను ఇస్తుందని వాపోయారు.

కాగా గడచిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ సమస్యలను శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కకు విన్నవించగా 7800 ఉన్న తమ వేతనాలను 13,600 కు పెంచుతూ సంతకం చేశారని తెలిపారు. ఇట్టి వేతనాలను 2024 జనవరి నుంచి మూడు నెలలు చెల్లించి తదనంతరం మళ్లీ పాత వేతనాన్ని జమ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కావున ప్రభుత్వం తమపై దయ తలచి పెంచిన వేతనాలను తమ ఖాతాలో జమ చేయవల సిందిగా విజ్ఞప్తి చేశారు. అలాగే మినీ అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత కల్పించి, ప్రతి నెల 5వ తేదీలోపు తమ వేతనాలను తమ ఖాతాలో జమ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు రమణ, శ్రీలత, మల్లిక ,ఝాన్సీ, రమాదేవి, కొమరమ్మ, సుజాత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.