31-01-2026 12:04:13 AM
ఎన్నికల వ్యయ పరిశీలకురాలు లావణ్య
భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 30, (విజయక్రాంతి): జిల్లాలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా, పారదర్శక వాతావరణంలో సజావుగా జరిగేలా అన్ని శాఖల అధికారులు పూర్తి బాధ్యతతో తమ విధులను నిర్వర్తించాలని మున్సిపల్ ఎన్నికల వ్యయ పరిశీలకురాలు లావణ్య సూచించారు. శుక్రవారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై ఏఈఓలు, తహసీల్దార్లు, ఫ్లయింగ్ స్క్వాడ్ టీములు (ఎఫ్‌ఎస్టీ), స్టాటిక్ సర్వైలెన్స్ టీములు (ఎస్‌ఎస్టీ), వీడియో సర్వై లెన్స్ టీములు (విఎస్టీ), వీడియో వ్యూయిం గ్ టీములు (వివీటీ)లతో కలిసి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందనతో కలిసి ఎన్నికల వ్యయ పరిశీలకురాలు లావ ణ్య సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు జిల్లాలో ఫ్లయింగ్ స్క్వాడ్ టీములు 8, స్టాటిక్ సర్వైలెన్స్ టీములు 8, వీడియో సర్వైలెన్స్ మరియు వీడియో వ్యూయింగ్ టీములు, జీఎస్టీ అధికారులు 8 మంది, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్లు (ఏఈఓలు) 10 మందిని నియమించినట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ను కట్టుదిట్టంగా అమలు చేస్తూ, ఎక్కడైనా నిబంధనల ఉల్లంఘన జరిగితే తక్షణమే చర్యలు తీసుకునే విధంగా అన్ని బృందాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికల వ్యయ పరిశీలకురాలు లావణ్య మాట్లాడుతూ, అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా కఠిన నియంత్రణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఎన్నికల సమయంలో అక్రమ నగదు, మ ద్యం, బహుమతులు తదితర ప్రలోభకర అంశాల పంపిణీని అడ్డుకునేందుకు ఎఫ్‌ఎస్టీ, ఎస్‌ఎస్టీ బృందాలు నిరంతర పర్యవే క్షణ చేపట్టాలని తెలిపారు. అభ్యర్థుల ఎన్నికల ఖర్చులు, ప్రచార సామగ్రి, ర్యాలీలు, సభలు, పత్రికా ప్రకటనలు, సోషల్ మీడియా ప్రచారం వంటి అన్ని అంశాలపై సమగ్ర అవగాహనతో పర్యవేక్షణ జరగాలని ఆమె స్పష్టం చేశారు. ప్రతి అభ్యర్థి ఖర్చును ఖచ్చితంగా నమోదు చేసి, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ఖర్చుల ఖాతాలను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు.
ఎన్నికల విధుల్లో ఉన్న అన్ని బృందాలు ప్రతిరోజూ నిర్వహించిన తనిఖీలు, స్వాధీనాలు, నమోదైన కేసులు తదితర వివరాలతో కూడిన రోజువారీ నివేదికలను తప్పనిసరిగా సమర్పించాలని, చేపట్టిన ప్రతి చర్యను ఖచ్చితంగా నమోదు చేసి స్వాధీనాల వివరాలను అధికారిక రికార్డుల్లో పొందుపరచాలని ఎన్నికల వ్యయ పరిశీలకురాలు లావణ్య ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో ఎటువంటి చిన్న నిర్లక్ష్యం చోటు చేసుకోకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రశాంత వాతావరణం లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. సంబంధిత శాఖల అధికారులు, తహసీల్దార్లు, ఎన్నికల నిర్వహణకు నియమిత వివిధ బృందాల సభ్యులు పాల్గొన్నారు.