calender_icon.png 31 January, 2026 | 3:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ పీఠం నీదా.. నాదా!

31-01-2026 12:49:02 AM

జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలో వేడెక్కిన రాజకీయం 

చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు అధికార ప్రతిపక్ష పార్టీల వ్యూహాలు 

ఇంకా అభ్యర్థుల ఎంపికలోనే ప్రధాన పార్టీలు

వికారాబాద్, జనవరి30: మున్సిపల్ పీఠం నీదా నాదా అన్నట్లుగా ప్రధాన రాజకీయ పార్టీలు  ఇప్పటికే ప్రచారం ప్రారంభిం చాయి. జిల్లాలోని వికారాబాద్, తాండూర్, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీలు ఉన్నాయి. కాంగ్రెస్,బీఆర్‌ఎస్ పార్టీల నుండి కౌన్సిలర్ పోటీ చేసేందుకు అభ్యర్థుల నుండి పెద్ద మొత్తంలో డిమాండ్ ఉండటంతో ఈ రెండు పార్టీలు టికెట్లు కేటాయించే విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాయి.  నామినేషన్ల ఘట్టం ముగిసిన కూడా ఇంకా ఎవరికీ అధికారికంగా టికెట్లు కేటాయిస్తునట్లు చెప్పలేదు. కొన్ని చోట్ల మాత్రం ప్రచారం ప్రారంభించుకోవాలని ఆశావాహులకు సూచిస్తున్నారు.

మునిసిపల్ ఎన్నికల్లో బిజెపి, ఎంఐఎం పార్టీలు కూడా తమ బలాన్ని చూపించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. గత ఎన్నికల్లో గెలిచిన బిజెపి అభ్యర్థులకు ఈసారి తిరిగి టికెట్ ఇచ్చి గెలిపించుకోవడంతో పాటు జిల్లాలోని నాలుగు మునిసిపాలిటీలో కౌన్సిలర్ సీట్లను ఘననీయంగా పెంచుకోవాలని బిజెపి అధిష్టానం స్థానిక నాయకులను ఆదేశించినట్లు సమాచారం. ఈ మేరకు బిజెపి ప్రయత్నాలు ప్రారంభించింది. ఇక ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రతి చోట ఎంఐఎం అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకోవాలని ఎంఐఎం అభ్యర్థులు వ్యూహాలు పన్నుతున్నారు.  మున్సిపల్ పీఠాన్ని ఆశిస్తున్న ప్రధాన పార్టీలకు మన తోడు తప్పనిసరి అయ్యేలా సీట్లు సాధించాలనే ప్రయత్నంలో ఎంఐఎం నాయకులు ఉన్నారు. 

వికారాబాద్ వరుసగా రెండోసారి మహిళకే

వికారాబాద్ మునిసిపల్ చైర్మన్ పీఠం ఈసారి ఎవరు దక్కించుకుంటారనే దానిపై ఓటర్లు తీవ్రంగా చర్చించుకుంటున్నారు.  వికారాబాద్ మునిసిపల్ మొత్తం 34 వార్డులు ఉండగా 58, 117 మంది ఓటర్లు ఉన్నారు. 2020లో వికారాబాద్ మునిసిపల్ చైర్మన్ జనరల్ మహిళకు కేటాయించగా ఈ దఫా ఎస్సీ మహిళకు కేటాయించారు. వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఎస్సీ ఉండటంతో ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ల సన్నిహితుల్లో ఎవరో ఒకరికి ఈ పదవి దక్కనుందని ప్రచారం జరుగుతుంది. చైర్మన్ పదవి దక్కించుకోవడం ఇద్దరూ నాయకులకు సవాలుగా మారింది.

కాంగ్రెస్ పార్టీ తరఫున చైర్మన్ రేసులో స్పీకర్ కుమార్తె అనన్య ఉన్నట్లు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చా రు.  బీఆర్‌ఎస్ నుండి చైర్మన్ రేస్ లో ఎవరున్నారనే విషయంపై ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ సతీమణి డాక్టర్ సబిత పోటీలో ఉంటున్నట్లు ప్రచారం జరుగుతున్నా అధికారికంగా ఎక్కడ ప్రకటించడం లేదు.  అయితే బిఆర్‌ఎస్ ప్రకటించే చైర్మన్ అభ్యర్థి ఎవరనే దానిపైనే గెలుపోటములు  నిర్ణయించబడతాయని  రాజకీయ విశ్లేషకులు చెబుతు న్నారు.  2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వికారాబాద్  బిఆర్‌ఎస్ చైర్మన్ గిరిని దక్కించుకోగా తదనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల కారణంగా చైర్మన్ అభ్యర్థి హస్తం చెంతకు చేరింది.

తాండూరులో ఈసారి బీసీకి అవకాశం

జిల్లాలోని నాలుగు మునిసిపాలిటీలలో తాండూర్ పెద్ద మున్సిపాలిటీ 36 వార్డులు ఉండగా 77,110 మంది ఓటర్లు ఉన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరిగిన రెండుసార్లు మున్సిపల్ ఎన్నికల్లో ఇక్కడ మహిళలే చైర్మన్ పీఠంపై కూర్చున్నారు. ఈసారి మాత్రం బీసీ జనరల్ కావడంతో అధికార ప్రతిపక్ష పార్టీల నుండి చైర్మన్ ఆశావాహుల సంఖ్య భారీగా ఉంది. తాండూర్ అసెంబ్లీ నియోజకవర్గం జనరల్ ఉండటంతో అధికార ప్రతిపక్షాల మధ్య ఎప్పుడు రాజకీయ ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ఇక్కడ అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్‌ఎస్ తో పాటు బిజెపి, ఎంఐఎంల కు కూడా బలమైన క్యాడర్ ఉంది.  2020 మునిసిపల్ ఎన్నికల్లో ఎంఐఎం పదికి పైగా కౌన్సిల్ స్థానాలు గెలిచి అధికార పార్టీకి చెమటలు పట్టించింది.

ఈ మునిసిపల్ ఎన్నికలను కూడా ప్రస్తుత ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గత రెండుసార్లు బీఆర్‌ఎస్ బల్దియా పీఠాన్ని దక్కించుకోవడంతో ఈసారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్ సాధించాలని చూస్తున్నారు. అయితే అధికార కాంగ్రెస్ మాత్రం ఎలాగైనా మునిసిపల్ చైర్మన్ పదవిని అస్తగతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. కాంగ్రెస్ తరపున చైర్మన్ రేస్ లో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్ రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. బిఆర్‌ఎస్ నుండి మాజీ కౌన్సిలర్ పట్లోళ్ల నర్సింలు, బిజెపి నుండి యు. రమేష్ కుమార్లు పోటీలో ఉన్నారు. వీరిలో చైర్మన్ పీఠం ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సి ఉంది.

కొడంగల్ జనరల్‌తో పోటీ తీరం

కొడంగల్ మున్సిపల్ 12 వార్డులు, 27,614 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ చైర్మన్ జనరల్ కావడంతో అధికార కాంగ్రెస్ లో పోటీ తీవ్రంగా ఉంది.  రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో ఎవరు చైర్మన్ అయినా అభివృద్ధి చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఆశతో అభ్యర్థులు ఉన్నారు.  ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుండి తాజా మాజీ చైర్మన్ జగదీశ్వర్ రెడ్డి మరోసారి చైర్మన్ పీఠాన్ని ఆశిస్తున్నారు. ఆయన మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి తనయుడు కావడం కొంత కలిసి వచ్చే అవకాశం ఉంది.

ఆయనతో పాటు మరో సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నందారం ప్రశాంత్ గుప్తా చైర్మన్ పీఠాన్ని బలంగా ఆశిస్తున్నారు. ఈయనకు కూడా రాజకీయ నేపథ్యం ఉంది. ప్రశాంత్ గుప్తా తాత నంద్యాల వెంకటయ్య చిన్నాన్న నందారం సూర్యనారాయణ ఇద్దరు గతంలో కొడంగల్ ఎమ్మెల్యేలుగా పని చేసిన వారే.  జగదీశ్వర్ రెడ్డి, ప్రశాంత్ గుప్తులు ఇద్దరు కాంగ్రెస్ వారే కావడంతో అధిష్టానం ఎవరి వైపు ముగ్గు చూపుతుందో వేచి చూడాల్సి ఉంది. బీఆర్‌ఎస్ నుండి చైర్మన్ పోటీలో ఎవరున్నారనే విషయంపై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు.

పరిగిలో బిసి జనరల్

పరిగి మునిసిపాలిటీ ఈసారి బీసీ జనరల్ కు  కేటాయించబడింది.  ఈ మునిసిపాలిటీలో 18 వార్డులు ఉండగా 27,614 మంది ఓటర్లు ఉన్నారు. 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఈసారి స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఎలాగైనా పరిగి మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా ఎగురవేయాలనే పట్టుదలతో ఉన్నారు. గెలిచే అవకాశం ఉన్న నాయకులకే కౌన్సిలర్ టికెట్లు ఇస్తున్నట్లు స్థానిక నాయకులు చెబుతున్నారు. 

గెలుపు వ్యూహం లో భాగంగానే చైర్మన్ అభ్యర్థి ఎవరనే విషయాన్ని గోప్యంగా ఉంచి ఎన్నికలకు పోతున్నారు. ఇది ఇలా ఉండగా బీఆర్‌ఎస్ పార్టీ సైతం రెండోసారి మున్సిపల్ పీఠాన్ని దక్కించుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు ప్రారంభించింది. బీఆర్‌ఎస్ చైర్మన్ అభ్యర్థిగా చివన్నోళ భాస్కర్ ను ప్రకటించి ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభించింది.