31-01-2026 01:22:22 AM
హైదరాబాద్, సిటీ బ్యూరో జనవరి 30 (విజయక్రాంతి) : బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కే చంద్రశేఖర్ రావును ఫోన్‌ట్యాపింగ్ కేసులో ఫిబ్రవరి 1న (ఆదివారం) మధ్యాహ్నం 3గంటలకు హైదరాబాద్‌లోని నందినగర్ నివాసంలోనే విచారిస్తామని దర్యాప్తు సంస్థ (సిట్) తేల్చిచెప్పింది. కేసీఆర్ చేసిన విజ్ఞప్తులను తోసిపుచ్చిన అధికారులు, విచారణ షెడ్యూల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు దర్యాప్తు సంస్థ తన నిర్ణయాన్ని స్పష్టం చేస్తూ తదుపరి చర్యలకు సిద్ధమైంది.
మున్సిపల్ ఎన్నికల హడావిడి ముగిసిన తర్వాతే తాను విచారణకు అందుబాటులో ఉంటానని, అది కూడా తన ఎర్రవెల్లి ఫాం హౌస్‌లో విచారణ జరపాలని కేసీఆర్ గురువారం సిట్‌కు రాసిన లేఖలో కోరారు. అయితే, దీనిపై సుదీర్ఘంగా చర్చించిన సిట్ అధికారులు కేసీఆర్ విన్నపాన్ని తోసిపుచ్చారు. దర్యాప్తులో జాప్యం జరిగే అవకాశం ఉన్నందున, మున్సిపల్ ఎన్నికలు ముగిసేవరకు వేచి చూడటం సాధ్యం కాదని తేల్చి చెప్పారు.
అలాగే, భద్రతా కారణాలు, అధికారిక రికార్డుల ప్రకారం ఆయన నివాసం నందినగర్‌లోనే ఉన్నందున, విచారణను అక్కడే నిర్వహించాలని నిర్ణయించారు. ఫాం హౌస్‌లో విచారణ జరపాలన్న విజ్ఞప్తిని తిరస్కరించడం ద్వారా చట్టపరమైన ప్రక్రియలో ఎటువంటి మినహాయింపులు ఇవ్వబోమని సిట్ పరోక్షంగా సంకేతాలిచ్చింది.
బీఆర్‌ఎస్ వర్గాల్లో ఉత్కంఠ..
తాజా నిర్ణయం ప్రకారం, ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటలకు సిట్ అధికారుల బృందం నందినగర్ నివాసానికి చేరుకోనుంది. వయసు రీత్యా పోలీస్ స్టేషన్‌కు రానక్కర్లేదన్న వెసులుబాటును కేసీఆర్‌కు కల్పించినప్పటికీ, విచారణ స్థలాన్ని మాత్రం అధికారులే ఖరారు చేయడం గమనార్హం. గతంలో ఇచ్చిన నోటీసుల నేపథ్యంలో కేసీఆర్ ఇప్పటికే తన న్యాయవాదులతో చర్చ లు జరిపారు.
ఇప్పుడు సిట్ కఠినంగా వ్యవహరిస్తూ, ఫాంహౌస్ ప్రతిపాదనను తిరస్క రించడంతో బీఆర్‌ఎస్ వర్గాల్లో తీవ్ర ఉత్కం ఠ నెలకొంది. ఎన్నికల సమయంలోనే విచారణకు పట్టుబట్టడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. సిట్ నోటీసుల నేపథ్యంలో ఎర్రవెల్లిలో కేసీఆర్‌తో కేటీఆర్, హరీశ్‌రావు సమావేశమయ్యారు. వారు న్యాయవాదులను కూడా సంప్రదిస్తున్నట్లు తెలిసింది.