31-01-2026 01:45:02 AM
లండన్ ‘బిలియనీర్ రో’లో విల్లాలు.. హోటళ్లు!
లండన్, దుబాయ్, యూరప్‌లో రూ. వెయ్యి కోట్లకుపైగా విలువైన ఆస్తులు
బ్లూమ్‌బెర్గ్ దర్యాప్తులో వెల్లడి
న్యూఢిల్లీ, జనవరి 30 : ప్రపంచానికి త్యాగం, నిరాడంబరత గురించి బోధించే ఇరాన్ పాలకుల అసలు రంగు బయటపడింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ కుమారుడు మోజ్తబా ఖమేనీ (56) విదేశాల్లో వేల కోట్ల విలువైన అక్రమ ఆస్తులను కూడబెట్టినట్లు బ్లూమ్‌బెర్గ్ ఏడాది పాటు జరిపిన పరిశోధనలో తేలింది. లండన్‌లోని అత్యంత ఖరీదైన ’బిలియనీర్స్ రో’ నుంచి జర్మనీలోని ఫైవ్ స్టార్ హోటళ్ల వరకు ఆయన సామ్రాజ్యం విస్తరించింది.
అమెరికా ఆంక్షలు ఉన్నా..
అమెరికా ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ, మోజ్తబా ఈ ఆస్తులను అత్యంత రహస్యంగా మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడా తన పేరు నేరుగా కనిపించకుండా, షెల్ కంపెనీలు, బినామీల ద్వారా ఈ నెట్‌వర్క్‌ను నడిపిస్తున్నారు. బ్రిటన్ గతేడాది ఆంక్షలు విధించిన ఇరాన్ బ్యాంకర్ అలీ అన్సారీ, ఈ ఆస్తుల వెనుక ఉన్న ప్రధాన వ్యక్తిగా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. కేవలం ఒక్క భవనం కోసమే 2014లో సుమారు రూ. 300 కోట్లు వెచ్చించినట్లు ఆధారాలు దొరికాయి. అలాగే, జర్మనీలోని ఫ్రాంక్ఫ ర్ట్, స్పెయిన్లోని మల్లోర్కాలో లగ్జరీ హోట ళ్లు ఈ నెట్వర్క్ పరిధిలోనే ఉన్నాయి. స్విట్జర్లాండ్, యూఏ ఈ, బ్రిటన్ బ్యాంకులను వాడుకుని ఇరాన్ చమురు సొమ్మును విదేశాలకు చేరవేసినట్లు నివేదిక పేర్కొంది.
ఇరాన్ ప్రజల్లో వ్యతిరేకత
ఇరాన్‌లో సామాన్యులు తీవ్ర ఆర్థిక సంక్షోభం, ఆకలితో అలమటిస్తుంటే.. పాలక వర్గం మాత్రం విదేశాల్లో ’అఘాజాదే’ (అధికారుల పిల్లలు) పేరిట విలా సవంతమైన జీవితాలను గడుపుతోందని ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమ వుతోంది. ఖమేనీ వారసుడిగా భావిస్తున్న మోజ్తబా పేరు మీద ఈ తరహా అవినీతి ఆరోపణ లు రావడం ఇరాన్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇరాన్ ప్రభుత్వ మీడియా మాత్రం ఖమేనీ కుటుంబాన్ని పేదరికంలో ఉండే ’ఫకీర్’ కుటుంబంలా చిత్రీకరిస్తోంది. కానీ, విదేశీ నిఘా సంస్థల విశ్లేషణ ప్రకారం.. మోజ్తబా కేవలం ఆస్తులతో పాటు ఇరాన్ సైనిక విభాగం ’రివల్యూషనరీ గార్డ్స్’పై కూడా బలమైన పట్టు కలిగి ఉన్నారని తేలింది.