04-12-2025 12:00:00 AM
దేశంలో రైతులు పండించిన ధాన్యం, ఉత్పత్తులు మార్కెట్‌లోకి వెళ్లే వరకు అన్నీ అడ్డంకులే కనిపిస్తున్నాయి. దీనికి తోడు అకాల వర్షాలు రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని సురక్షితంగా భద్రపరిచేందుకు సరైన గిడ్డంగులు లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఫలితంగా రైతు బ్రతుకు గాలిలో దీపంలా మారుతున్నది. లక్షలు పెట్టి పండించినా.. పంటల ఫలితం అందకపోవడం వల్ల రైతు బతుకు చిధ్రమవుతున్నది.
దేశానికి పట్టెడన్నం పెడుతున్న రైతుకు సరైన వసతులు కల్పించకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతున్నది. అన్ని రాజకీయ పార్టీ నాయకులు, అధికారులు రైతుల గురించి ఎన్నెన్నో కట్టుకథలు చెబుతుంటారు.. కానీ ఆచరణలో మాత్రం శూన్యం. క్రీడలకు ప్రాధాన్యమిస్తూ ఆధునిక స్టేడియాలు, ఇతర వసతులు ఏర్పాటు చేయడం ఆహ్వానించదగ్గదే. అయితే దైనందిన జీవితాలకు..
విషయాలకు తక్షణం అవసరంలేని రంగాలకు విస్తృత స్థాయిలో ఆధునిక సాంకేతిక ఆర్భాటాలు, హంగులతో అత్యున్నతమైన సేవలు కల్పించడం వ్యర్థం. కానీ రైతులు తమ పంట నిల్వను దాచుకునేందుకు మాత్రం ప్రభుత్వాలు గిడ్డంగులు ఏర్పాటు చేయడంలో విఫలమవుతున్నాయి. తద్వారా వ్యవసాయ ఉత్పత్తి నిల్వలకు సరైన ప్రణాళికలు చేపట్టకపోవడం వల్ల వ్యవసాయం అంటేనే రైతుకు ఆందోళన కలిగించే రీతిలో ప్రవర్తిస్తున్నారు.
ఒక విధంగా చెప్పాలంటే అదంతా అవసరమైన విషయం కాదన్నట్టు ప్రవర్తిస్తుంటారు. దేశం సుభిక్షంగా ఉండి అన్ని రంగాల్లో సర్వతో ముఖాభివృద్ధి చెందాలంటే ప్రాథమికంగా రైతుకు అత్యాధునిక పద్ధతిలో సకల సౌకర్యాలు ఉచితంగా ఏర్పాటు చేయాలి. ఇతర రంగాలకు ఏ విధంగానైతే ప్రాముఖ్యత ఇస్తున్నారో రైతుల విషయంలోనే అదే ధోరణితో వ్యవరిస్తే బాగుంటుంది. రైతు సుభిక్షంగా ఉంటేనే దేశం అన్ని రంగాల్లో ప్రగతి బాటలో పయనిస్తుంది.
దండరాజు రాంచందర్, సికింద్రాబాద్