calender_icon.png 19 July, 2025 | 5:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్ స్టేషన్‌లోనే హత్యాయత్నం

19-07-2025 12:00:00 AM

కారుతో ఢీ కొట్టిన ప్రత్యర్థులు ,  భూ తగాదాలే కారణం సినీ ఫక్కీలో హత్యకి యత్నం

 చేర్యాల, జులై 18:  భూతగాదాలో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ చిలికి చిలికి తుఫాన్‌గా మారి పొలీస్ స్టేషన్ లోనే హత్యా యత్నానికి పాల్పడిన సంఘటన సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమురవెల్లి మండలం లోని ఐనాపూర్ గ్రామానికి చెందిన ఆలేటి రామ్ రెడ్డి, నాయిని ప్రతాప రెడ్డిలకు కొంతకాలంగా భూమి విషయంలో గొడవలు జరుగుతున్నాయి.

పలుమార్లు పంచాయ తీలు నిర్వహించిన సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. విసుగు చెందిన ఓ వర్గం తన అనుచరులతో హత్య చేసేందుకు తెగబడ్డారు. శుక్రవారం కొమురవెల్లి లో గల మద్యం దుకాణం పర్మిట్ రూంలో ఆలేటి రామ్ రెడ్డి మద్యం సేవిస్తున్నాడన్న సమాచారం తెలుసుకున్న ప్రతాప్ రెడ్డి తన అనుచరులతో దాడి చేయడానికి ప్రయత్నించగా రామ్ రెడ్డి తప్పించుకునే క్రమంలో సమీపంలోని పోలీస్ స్టేషన్ లోకి బైక్ పై వెళ్లాడు.

పోలీస్ స్టేషన్ ఆవరణలోకి వెళ్లిన రాంరెడ్డిని ప్రతాపరెడ్డి తన అనుచరులు కారుతో ఢీ కొట్టి రామ్ రెడ్డిని హత్య చేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు ఇరువురిని అదుపులోకి తీసుకున్నారు. తీవ్రంగా గాయపడిన రామ్ రెడ్డిని చికిత్స నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన నాయిని ప్రతాపరెడ్డి, నాయిని యాదిరెడ్డి, రాంపురం మహేశ్వర్ రెడ్డి, నాయిని వెంకట్ రెడ్డి లను అరెస్టు చేసి రిమాండ్ పంపినట్లు ఎస్త్స్ర రాజు తెలిపారు.