19-07-2025 12:00:00 AM
* ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచన
* హుస్నాబాద్‌లో మార్నింగ్ వాక్,
* ప్రజలతో మాటామంతి
హుస్నాబాద్, జూలై 18 : పర్యావరణానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నందున ప్రజలు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. శుక్రవారం ఆయన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మార్నింగ్ వాక్ చేస్తూ ప్రజలతో మాట్లాడారు. ప్లాస్టిక్ వాడకం వల్ల ఎదురయ్యే ఇబ్బందులపై మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలోనూ పాల్గొన్నారు.
గ్రామాల్లో సైతం స్టీల్ బ్యాంక్ కోసం సామగ్రి పంపిణీ చేస్తున్నామని, పెండ్లి, ఫంక్షన్లకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడవద్దని, స్టీల్ సామాన్లు వాడాలని సూచించారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో హుస్నాబాద్ మున్సిపాలిటీ జాతీయ స్థాయిలో 139వ ర్యాంకు, రాష్ట్ర స్థాయిలో 9వ ర్యాంకు, జిల్లా స్థాయిలో ఒకటో ర్యాంకు సాధించి ఓడీఎఫ్ ప్లస్, ప్లస్ సర్టిఫికెట్ పొందినందుకు మున్సిపల్ అధికారులు, సిబ్బందిని అభినందించారు.
మున్సిపల్ కార్మికులకు టీ-షర్టులు, మిఠాయిలు పంపిణీ చేసి వారి సేవలను కొనియాడారు. హుస్నాబాద్ సుందరీకరణలో భాగంగా పొట్లపల్లి దారిలో ఆరెపల్లి చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన త్రిశూలం వాటర్ ఫౌంటేన్ను ఆయన ప్రారంభించారు. ఇప్పటికే పట్టణంలో పెద్ద ఎత్తున సీసీ రోడ్లు, నాలాల నిర్మాణం పూర్తి కావస్తుందని, జాతీయ రహదారి పెండింగ్ పనులు కూడా పూర్తవుతున్నాయని, వర్షాకాలంలో ఇండ్లలోకి నీళ్లు రాకుండా తగిన చర్యలు తీసుకున్నామని చెప్పారు.
అటునుంచి హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్నవారితో మాట్లాడారు. రోగుల కోరిక మేరకు ఆసుపత్రిలో వాటర్ ప్లాంట్ను 48 గంటల్లోనే ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన ప్రభుత్వంలో పేద ప్రజలకు కొత్త రేషన్ కార్డులు వచ్చాయని, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని, సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, దాంతో పాటు మహిళలకు, రైతులకు భరోసా కల్పించేలా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు.