calender_icon.png 13 August, 2025 | 6:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూసీ ఉగ్రరూపం

13-08-2025 01:26:56 AM

- మూసారంబాగ్ వంతెన జలదిగ్బంధం

- రాకపోకలు బంద్.. నత్తనడకన కొత్త వంతెన పనులు 

- పనుల జాప్యంపై వాహనదారుల ఆగ్రహం

హైదరాబాద్, సిటీ బ్యూరో ఆగస్టు 12(విజయక్రాంతి): చినుకు పడితే చాలు.. హైదరాబాద్‌లోని మూసారంబాగ్ వంతెన వాహనదారులకు నరకాన్ని చూపిస్తోంది. నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ నదికి మరోసారి వరద పోటెత్తడం తో, మంగళవారం అంబర్‌పేట్ వద్ద ఉన్న మూసారంబాగ్ వంతెన పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. వంతెన పైనుంచి ప్రమాదకర స్థాయిలో వరద నీరు ప్రవహిస్తుండటంతో, ట్రాఫిక్ పోలీసులు అప్రమ త్తమై రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు.

వాహనాల దారి మళ్లింపు

అంబర్‌పేట్ నుంచి దిల్‌షుఖ్‌నగర్ వైపు వెళ్లే వాహనాలను గోల్నాక కొత్త బ్రిడ్జి మీదుగా దారి మళ్లిస్తున్నారు. ప్రతి వర్షాకాలంలో ఇదే తంతు పునరావృతం కావడం, కిలోమీటర్ల కొద్దీ చుట్టూ తిరిగి ప్రయాణించాల్సి రావడంపై వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నత్తనడకన కొత్త వంతెన పనులు

ఈ ఏళ్లనాటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా, పాత వంతెన స్థానంలో ఎత్తున హై లెవల్ బ్రిడ్జి నిర్మాణాన్ని జీహెచ్‌ఎంసీ రెండే ళ్ల క్రితం ప్రారంభించింది. ప్రభుత్వాల నిర్ల క్ష్యం, అధికారుల చేతగానితనం కారణంగా ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయి.

రెండేళ్లలో 20% పనులే

అక్టోబర్ 2023లో రూ.34 కోట్ల వ్యయంతో ప్రారంభమైన ఈ పనులకు, ఇప్పటివరకు కేవలం రూ.8 కోట్లు మాత్రమే ఖర్చు చేసి, కేవలం 20 శాతం పనులనే పూర్తి చేశారు. వంతెన నిర్మాణానికి భూసేకరణ అతిపెద్ద అడ్డంకిగా మారింది. అంబర్ పేట్ నుంచి మలక్‌పేట్ వైపు బ్రిడ్జి నిర్మాణం కోసం 52 ఆస్తులను సేకరించాల్సి ఉండగా, దీనికి యజమానులు అంగీకరించడం లేదు. దీంతో ఇంజనీర్లు కేవలం నదిలోనే నాలుగు పిల్లర్లు నిర్మించి శ్లాబు పనులకే పరిమితమయ్యారు. రాత్రి సమయంలో అటు వైపు వెళ్లాలంటే ప్రజలు భయపడుతున్నారు.

 545 కోట్లు..15 వంతెనలు

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మూసీపై రూ.545 కోట్లతో 15 కొత్త వంతెనలకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ‘మూసీ నది పునరుజ్జీవ కార్యక్రమం’ పేరుతో కొత్త మాస్టర్ ప్లాన్‌కు శ్రీకారం చుట్టింది. ఈ కొత్త ప్రణాళిక పూర్తయ్యేవరకు ఇతర వంతెనల పనులు నిలిపివేసినా, వరద తీవ్రత దృష్ట్యా ఒక్క మూసారాంబాగ్ బ్రిడ్జి నిర్మాణానికే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయినప్పటికీ, భూసేకరణ సమస్యను అధిగమించడంలో అధికారులు విఫలమవుతున్నారు. రెండేళ్లలో పూర్తి కావాల్సిన ఈ కీలక వంతెన నిర్మాణం, ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మరో నాలుగేళ్లు పట్టినా ఆశ్చర్యపోనవసరం లేదని, అప్పటివరకు వర్షాకాలంలో తమకు కష్టాలు తప్పవని వాహనదారులు వాపోతున్నారు.