30-09-2025 12:37:59 AM
కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
సూర్యాపేట, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి) : గ్రామపంచాయతీ ,ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున అధికారులు ఎన్నికల కమిషన్ ఆదేశాలకు లోబడి విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ చెప్పారు. సోమవారం ఆయన సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపీటీసీ, జడ్పిటిసి, గ్రామపంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినందున తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిందన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చినందున ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తూ చా తప్పకుండా పాటించాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని దృష్టిలో ఉంచుకొని కొత్తగా ఎలాంటి ప్రభుత్వ పథకాలు మంజూరు చేయడం, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం, గ్రౌండింగ్ వంటివి చేయకూడదని తెలిపారు .
అధికారులు, సిబ్బంది ప్రజాప్రతినిధులతో ఎలాంటి సమావేశాలు, అధికారిక కార్యక్రమాలు, సమీక్షలు నిర్వహించకూడదని, వారితో సమావేశాలలో పాల్గొనకూడదని చెప్పారు. ఇది వరకే ప్రారంభించిన ప్రభుత్వ పథకాలు, అమలవుతున్న పథకాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. జిల్లా అంతటా గ్రామపంచాయతీ, ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటుందని చెప్పారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న దృష్ట్యా వచ్చే సోమ వారం నుండి ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. నవంబర్ 11 వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుందన్నారు.ఈ సమావేశంలో పీ డీ హౌసింగ్ సిదార్ధ , సిపిఓ కిషన్, డి ఏ ఓ శ్రీధర్ రెడ్డి, డి సి ఓ పద్మ, సంక్షేమ అధికారులు దయానంద రాణి, శంకర్, శ్రీనివాస్, నరసింహారావు , సూపర్టీడెంట్లు,అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.