01-05-2024 12:10:00 AM
మానవ పరిణామక్రమాన్ని వెనక్కి వెళ్ళి తెలుసుకునేందుకు దోహద పడేది చిత్రకళ. ఆదిమ సమాజం నుంచి మానవుడు పయనిస్తూ తన చరిత్రను తానూ బొమ్మల రూపంలో, శిల్పాల రూపంలో చిత్రీకరించకుంటే మానవ చరిత్ర కాలగర్భంలోనే కలిసిపోయే దేమో. ఆనందం కోసమో.. ఆటవిడుపు కోసమో.. చిత్రాలను రాతిగోడలపై, గుహాల్లో చిత్రించి ఉండకపోతే గతాన్ని తెలుసుకోవాలనే ఉత్సాహం చరిత్రకారులకు కలిగి ఉండకపోవచ్చు. ఒక అలవాటు వ్యసనంగా మారి మనిషిని ఒక దగ్గర కుదురుగా ఉండనివ్వదు. ఇదిగో అలా ప్రకృతి వెంట పరిగెత్తిన ఓ మట్టి మనిషి చరిత్రలో దాగిన నిగూఢ రహస్యాలను, సాహిత్యంలో దాగున్న అద్భుత బండాగారాన్ని.. సప్త వర్ణాలను
తన కుంచెతో సామాన్యుడికి కూడా అర్థమయ్యేలా చేశాడు. ఆయనే కొండపల్లి శేషగిరి రావు. దేశం గర్వించదగ్గ గొప్ప చిత్రకారుడు. ఆయన గురించి మరిన్ని విషయాలు శేషగిరిరావుగారి
కోడలు కొండపల్లి నీహారిణి మాటల్లో..
కొండపల్లి శేషగిరిరావుగారి జీవితం తెరిచిన పుస్తకం. బాల్యం, యవ్వనంలో ఎన్ని కష్టాలెదురైనా నిలిచి గెలిచారని చెప్పగలను. భారతీయ సంస్కృతిలో ముఖ్యమైన జీవన విధానమే కుటుంబ జీవన విధానం. మామగారు మా కుటుంబపట్ల ఎంత అభిమా నం, శ్రద్ధ వహించారో, వారి చిత్రకళను అంతే ప్రేమించారు. ప్రతిరోజు తెల్లవారు ఝామునే లేవడమైనా, యోగ, ధ్యానం చేయడం, వేళకు ఉద్యోగానికి పోవడం వంటివి నియమనిష్ఠలతో చేసేవారు. ఏనాడూ ఇతరులను దూషించడం నేను చూడలేదు. మర్యాదగా మసలుకో వాలనేవారు. లేనివాటి కోసం ఆరాటపడక ఉన్నవాటితో సంతృప్తి పడాలనే వారు. ప్రతిఫలాలకై ఆశపడటం కాదు. పనులు చేస్తూ పోవాలనేవారు.
ఇవన్నీ దగ్గరి నుండి చూసిన ప్రభావం నాపై చాలా పడింది. ఇది అందరికీ ఆచరణీయం కూడా అని నేను భావిస్తాను. రామాయణ, భారత, భాగవత చిత్రాలను చిత్రించేటప్పుడైనా, శకుంతల చిత్రాలు వేసేటప్పుడైనా ఆయా గ్రంథాల, పుస్తకాల విషయాలను ఆకలింపు చేసుకొని వేసేవారు. సందర్భోచితంగా పద్యాలనూ, శ్లోకాలనూ చదివి మాకందరికీ వినిపించేవారు. మాకు ఆశ్చర్యం కలిగేది. దేవతారూపాలు, అమ్మవార్ల చిత్రాలు వేసినప్పుడు ఏయే దేవతకు ఏయే రంగులవస్త్రాలు, ఆభరణాలు, గుర్తులు ఉండాలో అవన్నీ ప్రామాణికంగా ఉండేలా వేసేవారు. దసరా నవరాత్రులలో ఆ తొమ్మదిరోజులు నిష్టగా ఉండి వేసిన దుర్గాదేవి వివిధ రూపాల చిత్రాలు (దాదాపు 6 చిత్రాలు) మా ఇంట్లోనే ఉన్నాయి.
ఎన్ని అవార్డులు వచ్చినా, ఎన్ని సన్మానాలు అందుకున్నా ఎందరో గొప్ప వ్యక్తుల పరిచ యాలున్నా, తమవద్ద అంతగొప్ప కళ ఉన్నా, చదువు, తెలివి ఉన్నా కొంచెం కూడా గర్వం లేకుండా ఉండేవారు. అందరినీ సమాన త్వభావనతో చూసేవారు. ఎంత సంపాదించా మన్నది ముఖ్యం కాదు. ఎంతో దాచి ఉంచగలి గామ న్నది ముఖ్యం. దాచుకున్నది ఎంత నిజా యితీతో పొందా మన్నది ముఖ్యం అని ఎప్పుడూ చెప్పేవారు. వ్యక్తుల్ని చూసి కాకుండా వ్యక్తిత్వాన్ని చూసి మర్యాదచెయ్యాలని చెప్పిన కొండపల్లి శేషగిరిరావు ఆదర్శజీవి.
హరిజన మహాసభ సందర్భంగా ఒక చిత్రాన్ని చిత్రీకరించాడు అని విన్నాం. దాని గురించి చెప్పండి?
అది విశాఖపట్నంలో కాంగ్రెస్ పార్టీ హరిజన మహాసభలు నిర్వహించింది. బాట్టం శ్రీరామమూర్తి అని మంత్రిగా ఉండేవారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా కూడా పని చేశారు. గతంలో ఆయన జయ భారత్, ప్రజా రథం, ఆంధ్ర జనత వంటి పత్రికల్లో జర్నలిస్టుగా పనిచేసిన అనుభవం ఉంది ఆయనకు. ఆయన నాయకత్వంలో హరిజన సభలు జరుగుతుండేవి. ఆ హరిజన సభలకు బ్యాక్‌డ్రాప్ బొమ్మను గీసి ఇవ్వమని అడిగారు. ఆ సందర్భానికి తగ్గట్టు సంఘ సంస్కర్తల బొమ్మలతో ఒక మంచి బ్యాక్‌డ్రాప్ గీసి ఇచ్చారు.
శేషగిరి రావు గారి చిత్రాల్లో సామాన్యుల ప్రస్తావన గురించి చెప్పుకోవాల్సి వస్తే?
సామాన్యుల గురించి ఆయన యువకుడిగా ఉన్న సమయంలో చిత్రాలు చాలానే వేశారు. ఉదాహరణకు మొలకు గోచి కట్టుకొని చేపలు పడుతున్న జాలరి చిత్రాన్ని, అడవిలో కట్టెలు కొట్టుకొని వచ్చి అమ్ముకొని పొట్టనింపుకునే ఓ సామాన్యుడి చిత్రం. పొద్దుగుంగాక తన పనులు ముగించుకొని ఇంటికి వస్తున్న ఓ రైతు కుటుంబం. ఇలా సామాన్యుల జీవనాన్ని ప్రస్ఫుటించే అనేక చిత్రాలు ఆయన కుంచెనుండి జాలువారాయి. ఇవి కాకుండా కాకిపడిగెలు (స్క్రోల్ పెయింటింగ్) అనే జానపద కళా సంపదను వెలుగులోకి తీసుకొచ్చింది మామయ్య గారే. కాకిపడిగెలు అంటే ఈ కాలం వాళ్లకు తెలియకపోవచ్చు. కానీ కుల పురాణాలను చెప్పే పట చిత్రాలు. చేర్యాల వెళ్ళినప్పుడు వాటిని చూసి దాని గురించి వెలుగులోకి తీసుకొచ్చాడు. ఇది ఒకరకంగా బౌద్ధమత కాలం నుంచి ప్రచారం లో ఉన్న అతి పురాతన సంప్రదాయం. ఈ పురాణాలను చెప్పే వాళ్ళను కాకి పడిగెల వాండ్లు అనేవాళ్ళు వాళ్ళ గురించి ప్రపంచానికి పరిచయం చేశారు. ఆ కోణంలో మామయ్య గారి చిత్రాల్లో చాలా మట్టుకు సామాన్యుల జీవన చిత్రాలే ఎక్కువగా కనిపిస్తాయి.
శేషగిరిరావు కుటుంబ సభ్యులుగా మీరు ఎలా ఫీలవుతున్నారు?
గర్వంగా ఫీల్ అవుతాం. ఎందుకంటే తెలంగాణ వాడైవుండి ఈయన ఖ్యాతి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోకి పాకింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి ఆయన్ని గౌరవించాయి. అటువంటి వ్యక్తి వారసులం, కుటంబ సభ్యులం అని చెప్పుకోవడం గర్వంగా ఉంటుంది. అందుకే ఆయన నెలకొల్పిన ఆ కళలను కాపాడేందుకు శాయశక్తుల ప్రయత్నిస్తున్నాం.
‘కొండపల్లి ఎక్సలెన్సీ’ అవార్డు
కుటుంబ సభ్యులదా లేక కళాశాలదా?
అది మా వారు వేణుగోపాల్ రావు గారి మనసులోంచి పుట్టిన ఆలోచన. మా నాన్నగారి పేరు ఎప్పుడు ఉండాలి. అలాగే ఈ తరం చిత్రకారులకు ప్రొత్సాహకంగా ఉండాలని అనుకున్నారు. అందుకే దాన్ని నెలకొల్పడం జరిగింది. ఆయన పేరుతో ఎక్కడో పోటీలు నిర్వహించి ఇవ్వడం కంటే ఆయన చదువుకున్న కళాశాల, అక్కడే అధ్యాపకుడుగా పని చేసిన అనుభవం ఉంది కాబట్టి ఆయన పేరుతో అక్కడ ఇవ్వాలని ఆర్ట్ విభాగంలో వాటర్ పెయింటింగ్‌లో ఫస్ట్ వచ్చిన విద్యార్థులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం.
వాటర్ పెయింటింగ్ ‘ఆక్వా టెక్చర్’
గురించి ఆయన ఏమైనా చెప్పేవారా?
ఆయన నిరంతరం ఏదో ఓ ప్రయోగం చేస్తూనే ఉండేవారు. మేం ఆ కళారంగంలో నిష్ణాతులం కాదు కాబట్టి అంత డెప్తుగా ఆయనతో చర్చించలేదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలను. ఆయన ఏండ్ల క్రితం వేసిన ఆ ఆక్వాటెక్చర్ బొమ్మలు ఇప్పుడే వేశాడా అన్నట్లుగా ఉంటాయి. ఆ మిక్సింగ్ ఆఫ్ కలర్స్ అద్భుతమనే చెప్పాలి. దాన్ని కాలేజీలో పిల్లలకు కూడా నేర్పించారు కానీ కొద్దిమందికి మాత్రమే అది వంటబట్టింది.
శేషగిరిరావు గీసిన చిత్రాలు రిపబ్లిక్
పరేడ్‌లో నెహ్రూ, ఇందిరా గాంధీల
సమక్షంలో ప్రదర్శించబడ్డాయని
విన్నాం. వాటి గురించి చెప్పండి?
ఇప్పటికీ ఆ సంప్రదాయం కొనసాగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన శకటాలు ఆ పరేడ్‌లో ప్రదర్శించడాన్ని, అయితే నెహ్రూగారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి పాల్గొన్న ఆ శకటంలో మన రాష్ట్ర జీవన సంస్కృతి ఉట్టి పడేలా ఉండాలని మామ య్యగారి నేతృత్వంలోని టీమ్ కష్టపడి దాన్ని తీర్చిదిద్దారు. దాన్ని నెహ్రూగారు మెచ్చుకు న్నారని విన్నాను. ఆ తర్వాత ఇంధిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో రూపొందించిన శకటంలో కృష్ణానదిని ఉదాహరణగా తీసుకొని రూపొందించారు. దానికి కూడా గుర్తింపు వచ్చింది.
హైదరాబాద్‌తో ఆయనకు ఉన్న అనుబంధం గురించి చెప్పండి?
ఇప్పుడు విస్తృతి చెందిన హైదరాబాద్ నగరం. ఒకప్పుడది కొండలు, గుట్టలు, రాళ్ళు, కొలను, పచ్చని చెట్లతో కొలువుదీరేది. ఆ అద్భుతాన్ని మామయ్యగారి చిత్రాల్లో ఇప్పటికీ చూడవచ్చు. ‘సేవ్ రాక్స్’ అనే థీమ్‌తో ఆయన కుంచె నుండి జాలువారిని చిత్రాలు ఇప్పటికీ సజీవంగా చూడవచ్చు.
చిత్రకళ కాకుండా ఇంకే కళలోనైనా
శేషగిరిరావు గారికి ప్రావీణ్యం ఉండేదా?
మామయ్య చిత్రకారుడే కాకుండా మంచి రచయిత కూడా. తోటి కళాకారుల, గొప్ప వ్యక్తుల గురించి వ్యాసాలు కూడా రాశారు. వాటిని నేను 2009లో ‘చిత్ర రామణీయ కరము’ అనే పుస్తకంగా తీసుకొ చ్చాను. ఆ వ్యాసాల్లో చిత్రకళా విభిన్న రీతుల గురించి చర్చించారు. ముఖ్యంగా ఆ వ్యాసాల భాష శైలీ గురించి ప్రస్తావించు కోవాలి. అద్భుతమైన వాక్య నిర్మాణం ఉంటుంది. ఆయన రాతల్లో, ఓ సాహిత్య విద్యార్థి రాసినట్లుగా వాటిని రాశారు. వాటినే చూస్తే ఆయనలో ఓ మంచి రచయిత కూడా ఉన్నాడని చెప్పువచ్చు.
ఆయన మిత్ర బృందం గురించి చెప్పండి?
ఇవాళ ప్రాంతాలుగా విడిపోయాం కానీ ఆయనకు అటు ఆంధ్రలో, ఇటు తెలంగాణ ప్రాంతం లో మిత్రులు ఉండేవాళ్లు. తెలంగాణ నుండి దాశరథి, కాలోజీ, సినారే, వరదా చార్యులు వంటి ప్రముఖ కవులు, రచయితలు మామయ్య స్నేహితులు, అయితే వాళ్ళంత కవులు, రచయితలు అయితే మామయ్య గారు మాత్రం చిత్రకారుడు కావడంతో వాళ్ళంతా జోక్స్ కూడా వేసుకునేవాళ్లట. వీళ్ల మీద ఎంత అభిమానం, ఇష్టం ఉండేదో అటువైపున ఆంధ్ర వాళ్ళపైన కూడా అంతే ఇష్టం కనబరిచేవారు. అడవి బాపిరాజు, గుంటూరు శేషేంద్ర, మండలి వెంకట కృష్ణరావు గారు, ఆయన కొడుకు మండలి బుద్ద ప్రసాద్ వంటి వాళ్ళు ఆయనతో సన్నిహితంగా ఉండేవాళ్లు. భాషపట్ల ప్రేమే వాళ్ళ స్నేహానికి కారణం. అందుకే ఆయన నెలకొల్పిన ఆ కళలను కాపాడేందుకు శాయశక్తుల ప్రయత్నిస్తున్నాం.
అత్తమ్మ గురించి ఏమైనా చెప్పగలరా?
అత్తగారి పేరు కమలదేవిగారు. ఆమె చేతికి ఎముకలేని ఇల్లాలు. ఎంత పనైనా చేసేది. ఇంటికి ఎంతమంది వస్తే అంత సంతోషం ఉండేది. ఆమె కుటుంబమే ఇంత పెద్దది . అయినా ఎవరన్న ఇంటికి వస్తున్నరంటే ఎంతో సంతోషపడేది. చుట్టాలు ఇంటికొస్తున్నరంటే చాలా ఆనందపడేది. వీళ్లు ఆరుగురు అన్నదమ్ములు, ఒక చెల్లి. తర్వాత మా మామగారికి ఇద్దరు తమ్ముళ్లు, వాళ్ల భార్యలు అందరం కలిసి ఉమ్మడి కుటుంబంగా ఒకే చోట ఉండేవాళ్ళం. అత్తమ్మకు చాలా ఓపిక ఉండేది. యవ్వన ప్రాయంలో పూజలు అవి చేశారు కానీ గాయత్రి ఉపదేశం తీసుకున్నారు. పెద్ద పెద్ద ఋషులను కలిసి అనుభవాలు ఉన్నాయి కానీ ఒక వయసు వచ్చిన తర్వాత ఆయన పూజలు ఆపేశారు. ఆధ్మాత్మిక చింతన అనేది యోగా చేసుకోవడం, ధ్యానం చేసుకోవడం, రామచంద్రజీ వాళ్ళ పద్ధతిని అనుసరించ డం చేసుకుంటూ ఉండేది. ఆయన ఒక ఋషిలాగ ఒక గదిలో బొమ్మలు వేసుకుంటు ఉండే వారు. ఆయనను గురించి అత్తమ్మ కోపం తెచ్చు కోకుండా, మామయ్యను విసుక్కోకుండా సహా యపడేది.
మా అత్తమ్మ సహకారం ఉన్నది కాబ ట్టి మా మామగారు ఆ స్థాయికి ఎదిగారు. ఇక్కడ ఆడవాళ్ళ పనితనం, సహకారం పైకి కనిపించకుండానే చాలా ఉంటుంది. పిల్లలు ఉన్నప్పుడు రోగాలు, రోష్టులు, మంచి, చెడు, బయటివాళ్ళ చావులుంటాయి పోవాలి, రావాలి. పెళ్ళిళ్ళు ఉంటాయి వాటికి పోవాలి, రావాలి. అన్నీ ఈమెనే చూసుకునేది. కట్నాలు, కానుకలు కొనుక్కొని పోయేది. ఇవన్నీ బయటకు ఏర్పడని సహకారాలు. ఎంతోమంది ఇంటికి వచ్చేది. వాళ్లకు టీలు, కాఫీలు అందించడం. ఎంతోమంది మామయ్య విద్యా ర్థులు, సహచరులు ఇంట్లో భోజనాలు చేసేవారు. వాళ్లకు ఓపికగా వంట చేయడం, ఒడ్డించడం అన్నీ అత్తమ్మగారే చూసుకోనేది. అప్పట్లో అత్తమ్మగారు, వనమామలై వరదా చార్యులుగారి భార్య, బిరుదురాజు రామరాజు గారి భార్య ముగ్గురు సారస్వత పరిషత్ పరీక్షలు రాశారు. ఆడవాళ్ళది తెలియకుండానే కుటుంబాల్లో గొప్ప సహకారం ఉంటుంది. కుటుంబ పద్ధతి, పండుగలు, సంస్కృతి ఏది పోనిచ్చేది కాదు. మా అత్తయ్య మహా అందంగా ఉండేది. ఆమె ఇంటికి ఒక లక్ష్మీకళ.
హైదరాబాద్ సంస్థానం అంటే
పోరాటం, నిర్భంద జీవితం
గుర్తుకు వస్తుంది. వాటి గురించి
ఏమైన చిత్రాలు వేశారా?
ఆయనకు దృష్టిలోకి వచ్చిన ప్రతి అంశాన్ని చిత్రీకరించాడు. నిజాం కాలం అంటే నిర్బంధం అని చెప్పవచ్చు. ఆయన స్వయంగా ఆ నిర్బంధాన్ని అనుభవించి అరెస్ట్ అయ్యారు కూడా.ఆ కాలంలో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం గురించి చిత్రీకరించాడు. వెట్టిచాకిరీ, పెత్తందారి వ్యవస్థ గురించి, ఆనాటి క్రూరమైన శిక్షల గురించి చిత్రాలు వేశాడు. చిత్రాలే కాకుండా నిజాం కాలం నాటి పరిస్థితులను చెప్పేందుకు కార్టూన్స్ వేశాడు. ఆ కాలం నిజాం రాచరికాన్ని విమర్శిస్తూ కార్టూన్ వేయడం అంటే సాహసం అనుకోవాలి. అయినా ఆయన వెనుకడుగు వేయలేదు. ఒక కార్టూన్‌లో స్కూల్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తాడు. ‘ఇంత అలస్యంగా ఎందుకు వచ్చావు? అని పిల్లవాడిని ఉపాధ్యాయుడు అడిగితే “దారిలో ప్రొటెస్ట్ జరుగుతుండే అందుకే లేట్ అయింది” అని చెబుతాడు. ‘ఏమైన లాఠీ చార్జ్ జరిగిందా? అంటే.. ఏం అడుగుతున్నారు సార్ మన కమ్యూనిస్టులు ఇచ్చిన జవాబులకు పోలీసులు భయంతో తోకముడుచుకున్నారు’ అనే అర్థం వచ్చేలా ఆ కార్టూన్ ఉంటుంది. అలాగే రజాకార్ సైన్యం అరాచకాలు ఇలా అనేకం చిత్రించాడు.
నాన్నతో మీకున్న అనుబంధం?
మేం ఆరుగురం అన్నదమ్ములం ఒక సిస్టర్. అందులో ఆయన లోకంలో ఆయన ఉండే వారు. ఎక్కువగా ఇంటిని అమ్మనే చూసు కునేది. ఆయన జీవితమే పెయిటింగ్. సమయం దొరికితే సాహిత్య సమావేశాలకు వెళ్లేవాడు. ముఖ్యంగా నాన్న పొద్దున్నే లేచి మెడిటేషన్ చేసేవారు. గురువుల దగ్గర ఉపదేశాలు తీసుకున్నారు. చాలామంది గురువులు నాన్నగారికి పరిచయం.మెడిటేషన్ ద్వారానేఆయనకు ఏకాగ్రత పెరిగేది. ముఖ్యంగా ఆప్టర్ రిటైర్‌మెంట్ వీపరితమైన పెయిటింగ్స్ వేసేవారు. అన్నీ పెయింటింగ్స్ వైవిధ్యభరితమైనవి. ముఖ్యంగా వాటర్ కలర్ పెయింటింగ్స్ చాలా వేశారు. ఎందుకంటే అప్పుడు ఫ్రీ టైమ్ ఎక్కువ ఉండేది. పెయింటింగ్ నుంచి ఎప్పుడు డీవియేట్ కాలేదు.
పెయింటింగ్ మీద వివిధ ప్రయోగాలు చేశారు. మా చదువు గురించి జస్ట్ అడిగేవాడు కానీ ఈ ర్యాంక్ రాలేదు.. ఆ ర్యాంక్ రాలేదు అని ఏరోజూ పట్టించుకునేది కాదు. ఎవరి ఇష్టం వారిది అనేది నాన్నగారు. ముఖ్యంగా నాన్నగారితో నాకున్న అటాచ్‌మెంట్ ఏమిటం టే మధ్యవాణ్ని కాబట్టి నాన్నగారితో మీటింగ్‌లకు, ఎగ్జిబిషన్‌లకు నేనే ఎక్కువగా వేళ్లేవాణ్ని. ఆర్టిస్టులను విమర్శిస్తే డైరెక్టుగా విమర్శించేవారు. ఆర్టిస్టులకు కొన్ని కొన్ని కరెక్షన్స్ చెప్పేవారు. ఆ కరెక్షన్స్ సరిచేసుకొని ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్టులు అయినవాళ్ళు ఉన్నారు. ఆర్థికపరమైన వ్యవహరాలన్నీ అమ్మనే చూసుకోనేది. పెయింటింగ్స్ వేస్తున్నప్పుడు నాన్నను అమ్మ కొంచెం కూడా డిస్టర్బ్ చేసేది కాదు. ఆయనకున్న పరిచయాలు పెద్ద పెద్ద పరిచయాలు. స్వాతంత్ర సమరయోధుడు కాబట్టి నాయకులు, కవులు, కళాకారులు అందరితో పరిచయాలు ఉండేవి. నాన్నగారు ఫ్రీడం ఫైటర్ కూడా. ఆయనకు సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్ కూడా వచ్చేది.
అరెస్ట్ కూడా అయ్యారు ఒకసారి వారెంట్ కూడా వచ్చింది. నాన్న చేసేది ప్రతిదీ రిసెర్చ్ ఓరియేంటెడ్‌గా ఉంటుంది. నాకు తెలిసి నాన్నగారు ఆర్ట్ ఫిల్డ్‌లో ఒక సైంటిస్టు. నాన్నగారు ఎక్కువగా చైనిస్ మాగజైన్స్, నేషనల్ జియోగ్రఫీ చూసేవాడు. అవి చూస్తున్నప్పుడు డిస్టర్బ్ చేస్తే ఆయనకు బాగా కోపం వచ్చేది. క్రికెట్ మ్యాచ్ కోసం మేము.. నేషనల్ జియోగ్రఫీ కోసం నాన్న ఎదురుచూసే వాళ్ళం. టీవీ వచ్చిన తర్వాత ఆయనను ఎక్కువగా ఎవరూ డిస్టర్బ్ చేసేవాళ్ళం కాదు. టీవీ రాకముందు ఎక్కువ ప్రకృతి మీదనే ఆధారపడ్డారు. నాన్న గారి చిత్రాల్లో ప్రకృతి చిత్రాలే ఎక్కువగా కనిపిస్తాయి. నాన్నగారు ఎప్పుడు పెయింటింగ్స్‌ను అమ్ముకోలేదు. ఇంటికే వచ్చి పెయింటింగ్స్ కొనేవాళ్లు. ముఖ్యంగా చిత్రకళలో ఏ అంశం వొదిలిపెట్టలేదు. ప్రపంచవ్యాప్తంగా నాన్నగారికి గుర్తింపు లభించింది. మన ప్రభుత్వం సాహిత్యంలో కృషి చేసిన వారికి దాశరథి స్మారక అవార్డు, కాళోజీ అవార్డు ఇస్తున్నట్టుగానే నాన్నగారి పేరుమీద కూడా చిత్రకళలో కృషి చేసిన వారికి అవార్డు ప్రకటిస్తే బాగుండేది.
- కొండపల్లి వేణుగోపాల్ రావు