19-07-2025 12:07:20 AM
- లోపించిన పారిశుద్ధ్యం
- కొనసాగుతున్న వసూళ్ల పర్వం
రామకృష్ణాపూర్, జూలై 18 : భక్తులకు కొంగుబంగారమైన గాంధారి మైసమ్మ ఆలయానికి వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బొక్కల గుట్ట గాంధారి మైసమ్మ అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు సంవత్సరం పొడవున ఆలయానికి భక్తులు పెద్దసంఖ్యలో వస్తూ ఉంటారు. ప్రతి ఏటా అమ్మవారి ఆషాడ మాసంలో బోనాల జాత ర ఉత్సవాలను కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.
గాంధారి వనంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఉన్నపటికీ ప్లాంట్ పని చేయక పోవడంతో భక్తులకు నీటి తిప్పలు తప్పడం లేదు. భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పించడంతో ఆలయ కమిటీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఆలయానికి వచ్చే ఆదాయంతో కనీస సౌకర్యాలు కూడా కమిటీ అందించడం లేదని భక్తులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు.
లోపించిన పారిశుద్ధ్యం
భక్తులు అమ్మవారికి బోనాల మొక్కులు చెల్లించిన అనంతరం గాంధారి వనంలో బోజనాలను వండుకొని తినడం ఆనవాయితీగా వస్తోంది. అయితే వనం పరిసరాల్లో మాత్రం చెత్తకుప్పలు, ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసులు, తిని వదిలేసిన వ్యర్థాలు దర్శనమిస్తున్నాయి. వనంలో ఉన్న మరుగుదొడ్ల వద్ద ముక్కులు మూసుకునే దుస్థితి నెలకొంది. ఆలయ కమిటీ పారిశుద్ధ్య నిర్వహణ కొరకు భక్తుల వద్ద రుసుము వసూలు చేసినప్పటికీ పారిశుధ్యం లోపించి దుర్వాసన వెదజల్లుతోంది.
కొనసాగుతున్న వసూళ్ల పర్వం
ఆషాడ మాసం కావడంతో నిత్యం అమ్మవారిని దర్శించుకొని, మొక్కులు చెల్లించేం దు కు భక్తులు వస్తూ ఉంటారు. అది, బుధ వారా ల్లో భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇదే స మయంలో మేక, కోళ్లతో మొక్కులు చెల్లించుకునేందుకు కమిటీ టికెట్‌కు రుసుము తీసుకో గా, అక్కడ ఉండే వాళ్ళు డిమాండ్ చేసి మరీ అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇదేతంతు కొనసాగిస్తుండడంతో మిగిలిన రోజు ల్లో సైతం వారి వసూళ్లకు అడ్డూ అదుపు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.
వివాదాలకు నిలయంగా ఆలయ కమిటీ
గాంధారి మైసమ్మ ఆలయ కమిటీ వివాదాలకు నిలయంగా నిలుస్తోంది. గత కొద్ది రోజుల క్రితం గాంధారి మైసమ్మ గుడి ఆదాయాన్ని ఆ ఆలయ కమిటీ దుర్వినియోగం చేస్తుందంటూ బొక్కల గుట్ట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మంచిర్యాల జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. గుడి ఆదాయాన్ని కమిటీ సభ్యులు బయటి వ్యక్తులకు వడ్డీలకు ఇస్తూ ఆదాయాన్ని దుర్వినియోగం చేస్తు, ఆలయానికి వచ్చే భక్తులకు స్పెషల్ దర్శనం, వాహన పూజలు, కోళ్లు మేకలకు సంబంధించిన టికెట్లకు అధిక రుసుమును వసూళ్ళు చేస్తు భక్తులపై అధిక భారాన్ని వేస్తున్నారంటూ పలు ఆరోపణలు వస్తున్నాయి.
ఈ నెల 20న నిర్వహించే బోనాల జాతరకు ఆలయ కమిటీ హడావుడిగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, ఏటా ఏర్పాట్ల విషయంలో కమిటీ విమర్శలు మూటగట్టుకోవాల్సి వస్తోంది. జాతరలో పారిశుద్ధ్య లోపం, త్రాగునీటి సమస్యలు పునరావృతం అవుతున్నాయి. ఈసారైనా సక్రమంగా ఏర్పాట్లు చేసి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.