ఉద్యమాల ఆయువుపట్టు ‘నీలగిరి’

29-04-2024 01:36:24 AM

ప్రత్యేక తెలంగాణ తొలి, మలి ఉద్యమాల్లో కీలకపాత్ర

రాజకీయ పార్టీలకు ఎన్నికల సమయంలో ‘ఫ్లోరైడ్ ఎఫెక్ట్’

పార్లమెంట్ స్థానంలో మొదటి ఎంపీ ‘రావి’

స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ‘కాంగ్రెస్’కే పట్టం

నల్లగొండ, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): నల్లగొండ... రాజకీయ చైతన్యానికి ప్రతీక. స్వాతంత్రోద్యమంతోపాటు నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన గడ్డ.. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో తనదైన ముద్ర వేసిన జిల్లా. నల్లగొండ పార్లమెంట్ స్థానం 1952లో ఏర్పాటైంది. ఇప్పటివరకు 18 పర్యాయాలు ఎన్నికలు జరుగగా, ఎక్కువసార్లు కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల మధ్య హోరాహోరీ పోరు కొనసాగింది. 2008లో నియోజకవర్గాల పునర్విభజనతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ పార్లమెంటు స్థానాలు కాస్తా నల్లగొం డ, భువనగిరి నియోజకవర్గాలుగా మార్పు చెందాయి. నల్లగొండ పరిధిలోని అసెంబ్లీ స్థానాలు భువనగిరికి, మిర్యాలగూడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ స్థానాలు నల్లగొండకు మారాయి. ప్రస్తుతం నల్లగొండ పార్లమెంటు పరిధిలో నల్లగొండ, దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హూజూర్‌నగర్, సూర్యాపేట, నకిరేకల్ శాసనసభ స్థానాలు ఉన్నాయి. 

ఏకంగా 682 నామినేషన్లు

నల్లగొండ పార్లమెంటు స్థానంలో 1996 లో జరిగిన ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మునుగోడు, నల్లగొండ నియోజకవర్గాల పరిధిలో ఫ్లోరైడ్ ప్రభావంతో పెద్ద సంఖ్యలో ప్రజలు వికలాం గులుగా మారేవారు. దీంతో జల సాధన సమితి పేరుతో దుశ్చర్ల సత్యనారాయణ ఓ ఉద్యమాన్నే నడిపించారు. ఫ్లోరైడ్ అంశాన్ని అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో 1996 ఎన్నికలో ఏకంగా 682 మంది ఉద్యమకారులతో నామినేషన్లు వేయించారు. దీంతో బ్యాలెట్‌ను రూపొందించడం ఎన్నికల కమిషన్‌కు సవాలుగా మారింది. దీంతో ఎన్నికను వాయిదా వేశారు. అనంతరం ఎన్నికల కమిషన్ పలు సంస్కరణలు తీసుకొచ్చింది. అప్పటివరకు ఉన్న 1951 లోని ప్రజాప్రాతినిథ్య చట్టం సెక్షన్ 34(1) ప్రకారం లోక్‌సభకు పోటీ చేసే జనరల్ అభ్యర్థులకు పూచీకత్తుగా ఉన్న రూ.500ను రూ.25 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల పూచీకత్తు రూ.250ను రూ.10 వేలుగా మార్చింది.

సిమెంట్ పరిశ్రమల పార్లమెంటు నియోజకవర్గాన్ని సిమెంట్ పరిశ్రమల  చెప్పవచ్చు. కృష్ణా పరివాహక ప్రాంతంలో విస్తరించి ఉన్న సున్నపురాయి ఖనిజాలతో ఈ ప్రాం తంలో 70కిపైగా సిమెంటు పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ప్రముఖంగా నాగార్జున సిమెంటు, రాశి సిమెంట్, మహా సిమెంటు, పెన్నా సిమెంటు పరిశ్రమలు ఉన్నా యి. కృష్ణా నదిపై నిర్మించిన బహుళార్థక సాధక ప్రాజక్టు నాగార్జునసాగర్.. జలవిద్యుత్తు, సాగు, తాగునీరు అందిస్తున్న ప్రాజెక్టుగా తెలంగాణకు ప్రధాన వనరుగా పేరొందింది. నియోజకవర్గ పరిధిలోని మిర్యాలగూడకు ఆసియాలోనే అత్యధిక రైస్‌మిల్లులు ఉన్న ప్రాంతంగా గుర్తింపు ఉన్నది. 4 వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్తు పవర్ ప్లాంటు యాదాద్రి థర్మల్ ప్లాంటు మిర్యాలగూడ శివారులో దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మితమవుతున్నది. 

దర్శనీయ ప్రాంతాలు..

నల్లగొండ పార్లమెంట్ పరిధిలో ఆధ్యాత్మికంగా, చారిత్రాత్మకంగా పేరొందిన ఆలయా లు ఉన్నాయి. వాడపల్లిలోని మీనాక్షి అగస్థ్యేశ్వరస్వామి ఆలయం, నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఛాయా సోమేశ్వరాలయం, పానగల్ శివాలయం, చెరువుగట్టు రామలింగేశ్వరాలయం, సూర్యాపేట సమీపంలో పిల్లలమర్రి ఆలయాలు ఉన్నాయి.

నీటి వనరులు 

నల్లగొండ జిల్లా ప్రధానంగా వ్యవసాయాధారిత  ప్రాంతం. ప్రధానంగా నాగార్జు న సాగర్ ప్రాజెక్టుతోపాటు డిండి, మూసీ, ఎసెల్బీసీలో భాగంగా చేపట్టిన ఏఎమ్మార్పీ ఎత్తిపోతల పథకాలు సాగు నీరందిస్తున్నాయి. జిల్లాలో ప్రధాన పంట వరి. మిర్యా లగూడ ప్రాంతంలో అత్యధికంగా పారాబాయిల్డ్ రైసుమిల్లులు ఉన్నాయి. నాన్ ఆయకట్టు ప్రాంతంలో పత్తి, మిర్చి, కూరగాయల సాగు, ఉద్యాన పంటలైన బత్తాయి, నిమ్మ అధికంగా సాగు చేస్తారు. నకిరేకల్ ప్రాంతం నిమ్మతోటలకు ప్రసిద్ధి.

తొలి ఎంపీ సాయుధ పోరాట యోధుడు రావి..  

నల్లగొండ పార్లమెంట్ స్థానానికి 1952లో జరిగిన తొలి ఎన్నికలో ఆలేరు ప్రాంతానికి చెందిన తెలంగాణ సాయిధ పోరాట యోధుడు రావి నారాయణరెడ్డి గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి వీబీ రావుపై 2,72,280 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇది దేశ తొలి ప్రధాని నెహ్రూ కంటే ఎక్కువ మెజార్టీ కావడం విశేషం. తెలంగాణ సాయిధ పోరాట యోధులు రావితోపాటు దేవులపల్లి వెంకరటేశ్వరరావు, బొమ్మగాని ధర్మభిక్షం కూడా ఇక్కడి నుంచి ఎంపీలుగా విజయం సాధించారు. సీపీఐ జాతీయ కార్యదర్శిగా పనిచేసిన సురవరం సుధాకర్‌రెడ్డి సైతం నల్లగొండ  నుంచి 1998, 2004 ఎన్నిక ల్లో ఎంపీగా గెలిచారు. ప్రస్తుత శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి 1999, 2009, 2014లో విజయం సాధించారు. ఉత్తమ పార్లమెంటిరియన్‌గా పేరుపొందిన సూది ని జైపాల్ రెడ్డి సైతం మిర్యాలగూడ (ప్రస్తుత నల్లగొండ) నుంచి ఎంపీగా గెలుపొం దారు. వాస్తుశిల్పిగా పేరుగాంచిన బీఎస్ రెడ్డి సైతం ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించారు.