07-01-2026 12:00:00 AM
మద్దతు పలికిన అన్ని పార్టీలు
నందిపేట్, జనవరి 6 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండల కేంద్రంలో బస్సు డిపో ఏర్పాటు కు ఐక్యచరణ కమిటీ సభ్యుల పిలుపు మేరకు మంగళవారం నందిపేట్ ప్రజలు తమ నిరసనను తెలుపుతూ మండలం బంద్ పాటించారు. ఈ బంద్ కార్యక్రమం లో స్వచ్ఛందంగా స్థానిక దుకాణదారులు తమ వ్యాపారాలను మూసివేసి నిరసన తెలుపుతూ బంద్ నిర్వహించారు. మంగళవారం ఉదయం నుంచి మండలంలో ని దుకాణా దారులు, స్కూల్స్, కాలేజీలు కూడా బంద్ పాటించి తమ నిరసనను తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నందిపేట్ మండల ప్రజల కోరిక మేరకు ప్రజల రవాణా సౌకర్యార్థం బస్ డిపో ను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.
సంవత్సరాల తరబడి ప్రజల ప్రజల అవసర నిమిత్తం ఆర్టీసీ డిపో ఏర్పాటు చేసి నందిపేట్ ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలని కోరారు. ప్రజలు స్వచ్చందంగా డిపో ఏర్పాటు కోసం భూసేకరణ చేసి ఇచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వంస్పందించని యెడల భవిష్యత్తులో తమ ఆందోళనను పెద్ద ఎత్తున తెలుపుతూ ఉద్యమాలు చేపడతాం అని హెచ్చరించారు. ఆర్టీసీ డిపో ఏర్పాటు కోసం జరిగిన మండల బంద్ కు అన్ని పార్టీలు మద్దతు తెలిపారు. పోలీసులు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.