31-10-2025 12:02:00 AM
టాలీవుడ్ హీరో నారా రోహిత్ ఓ ఇంటివాడయ్యాడు. ‘ప్రతినిధి2’ సినిమాలో తనతో కలిసి నటించిన శిరీషతో కొత్త జీవితాన్ని ఆరంభించేందుకు ఆమెతో కలిసి ఏడడుగులు వేశాడు. గురువారం రాత్రి 10.35 గంటలకు రోహిత్-శిరీషల వివాహం హైదరాబాద్‌లో జరిగింది. గత శనివారం నిర్వహించిన తొలి ఘట్టం హల్దీ వేడుకతో ఈ పెళ్లి సందడి మొదలైంది. గురువారం వివాహానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు, మంత్రి లోకేశ్, ఇరువురి కుటుంబ సభ్యులు, ఆత్మీయులతోపాటు సినీ, రాజకీయ, వ్యాపార రంగాల ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. రోహిత్ మనువాడిన శిరీష స్వస్థలం ఏపీలోని రెంటచింతల. తల్లిదండ్రులకు నాలుగో సంతానమైన శిరీష్ ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యనభ్యసించారు. అక్కడే కొంతకాలం ఉద్యోగం కూడా చేశారు.
నటనారంగంపై ఉన్న ఆసక్తితో ఇండియా వచ్చేశారు. హైదరాబాదులో తన సోదరి ప్రియాంక వద్ద ఉంటూ సినిమా ప్రయత్నాలు చేశారు. అలా ‘ప్రతినిధి2’కి ఎంపిక కావడం.. రోహిత్ తో పరిచయం కావడం ఈ జంటను నూరేళ్ల పంట వైపు నడిచేలా చేశాయి. తొలుత వీరి మధ్య స్నేహం చిగురించి, తర్వాత ప్రేమగా మారింది. కొంతకాలంగా ప్రేమించుకున్న ఈ జంట పెద్దల అంగీకారంతో నిరుడు నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ జంట పెళ్లి వేడుకకు సంబంధించి ఫొటోలు ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తున్నాయి. ఎట్టకేలకు తమ అభిమాన హీరో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.