01-09-2025 01:18:32 AM
సాందీపని గురుకుల పాఠశాల నూతన భవనాన్ని ప్రారంభించిన కేంద్ర
విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
తాండూరు, 31 ఆగస్టు, (విజయశాంతి): దేశం అభివృద్ధి చెందాలంటే విద్య, విజ్ఞానం, వైజ్ఞానికరంతోనే సాధ్యమవుతుందని కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు . ఆదివారం ఆయన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, కేంద్ర విద్యాశాఖ అధికారులతో కలిసి తాండూర్ మండల పరిధిలో ఉన జినుగుర్తి ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాందీపని గురుకుల పాఠశాల నూతన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... దేశంలో ఎటువంటి మార్పుకైనా గ్రామీణ ప్రాంతాల నుంచి ఉద్యమం ఉండాలన్నారు. మన దేశం స్వరజ్య దేశంగా ఎదగాలని, ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలవాలంటే అందుకు ఏకలవ్య గురుకులాల ద్వారానే సాధ్యమవుతుందని మంత్రి తెలిపారు. రాబోయే 100 సంవత్సరాల దేశ స్వరాజ్యంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయ ఉత్స వాలు నిర్వహించాలని మంత్రి పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ పారిశ్రామికంగా, సాంకేతికంగా అభివృద్ధి చెందడం అభినందనీయమని అన్నారు. పాఠశాలల్లో యోగాను అమలు చేయాలని, దీనివల్ల శారీరక, మానసిక ఆరోగ్యంతో జీవించవచ్చని మంత్రి తెలిపారు. తాండూర్ శాసనసభ్యులు మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ విద్యను వ్యాపార సంస్థలు గా కాకుండా జ్ఞానాన్ని పెంపొందించే దిశగా ఉండాలని.
రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ ప్రభుత్వ పాఠశాలలను పూర్వవైభవానికి తీసుకు వస్తున్నట్లు ఆయన తెలిపారు.యువతకు భరోసా నిమిత్తం ఏటీసీలను ఏర్పాటు చేశారని.. రాష్ట్రంలో కులాల కు అతీతంగా విద్యను అభ్యసించాలన్న సదుద్దేశంతో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని అన్నారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో గురుకులాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమని కలెక్టర్ అన్నారు.
సాందీపని గురుకుల పాఠశాల ఆవరణలో మంత్రి విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ చైర్మన్(జమ్మూ అండ్ కాశ్మీర్) సతీష్ చంద్ర , జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి, ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు భాగయ్య, చైర్మన్ పి. వెంకటేశ్వర రావు, సందీపని గురుకులం చైర్మన్ మల్లారెడ్డి, ఎస్బిఐ చీఫ్ జనరల్ మేనేజర్ రాధాకృష్ణన్, వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన ప్రొఫెసర్స్, డాక్టర్లు లు పాల్గొన్నారు.