01-09-2025 01:20:21 AM
మాజీ ఎంపీ, బీజేపీ నాయకులు బూర నర్సయ్య గౌడ్
అబ్దుల్లాపూర్‌మెట్, ఆగస్టు 31: మజీద్‌పూర్ సీలింగ్ భూ బాధితులకు అండగా ఉంటానని భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు, బీజేపీ రాష్ట్ర నాయకులు బూర నర్సయ్య గౌడ్ అన్నారు. మజీద్‌పూర్ సీలింగ్ భూ బాధితుల ఆహ్వానం మేరకు ఆదివారం గ్రామానికి విచ్చేశారు.
గత ప్రభుత్వ హయాం 1993లో 243.31 ఎకరాల భూమిలో 143 మందికి సీలింగ్ సర్టిఫికెట్లు ఇచ్చినట్లు తెలిపారు. నాటి నుంచి నేటి వరకు అధికారుల చుట్టూ తిరిగినా.. తమకు న్యాయం జరగలేదని బాధితులు వివరించారు. ఈ సందర్భంగా బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ.. సీలింగ్ భూ బాధితులకు అండగా ఉండి.. న్యాయం జరిగే వరకు పోరాడుతానన్నారు.
అధికారులు స్పందించకపోతే.. సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి తీసుకెళి.. భూ బాధితుల వెంటే ఉండి.. న్యాయపోరాటం చేద్దామని బాధితులకు భరోసా నిచ్చారు. ఈ సమస్య దశాబ్దాలుగా కొనసాగడం ముమ్మాటికీ వ్యవస్థ లోపమేనన్నారు. మజీద్‌పూర్ గ్రామానికి చెందిన 117 మందిని పీఎం విశ్వకర్మ యోజన పథకానికి ఎంపిక చేసి.. ఆర్థిక సహాయం అందజేయున్నట్లు బూర నర్సయ్య గౌడ్ తెలిపారు.
దేశవ్యాప్తంగా సంప్రదాయ వృత్తులు చేసే కులాల అభ్యున్నతికి, ఆత్మనిర్భర్ భారత్ సాధనకు ఒక కీలక ఆవిష్కరణన్నారు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి నరసింహ గౌడ్, వడ్డేపల్లి పాపయ్య, విష్ణు, నిఖిలేష్ గుప్తా, గడ్డం వెంకటేష్, కసరగొని వెంకటేష్, సీలింగ్ భూ బాధితులు, విశ్వకర్మ యోజన లబ్ధిదారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.