28-07-2025 01:54:19 AM
హైదరాబాద్, జూలై 27 (విజయ క్రాంతి): దేశంలోని బీసీలంతా రాజకీయలకు అతీతంగా ఐక్యం కావలసిన అవసరం ఉందని బీజేపీ నేత ఈటల రాజేందర్, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ, బీఆర్‌ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఆగస్టు 7న గోవాలో జరిగే జాతీయ ఓబీసీ మహాసభను జయప్రదం చేయడం ద్వారా బీసీల ఐక్యతను దేశానికి చాటి చెప్పాలని వారు పిలుపునిచ్చారు.
ఆదివారం హైదరాబాదులో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఆగస్టు 7న గోవాలో జరిగే 10వ జాతీయ ఓబీసీ మహాసభను విజయవంతం చేయాలని కోరుతూ ఎంపీలు రాజేందర్, అసదుద్దీన్ ఒవైసీ, వద్దిరాజు రవిచంద్రలను కలిసి మహాసభల వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. మహాసభలకు హాజరుకావాలని ఈటలకు ఆయన ఇంటి వద్ద, అసదుద్దీన్ ఓవైసీకి దారుసలెంలో, ఎంపీ ఒద్దిరాజు రవిచంద్రను ఆయన నివాసంలో కలిసి ఆహ్వాన పత్రికలను అందజేశారు.
ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీసీలకు మంచి రోజులు రానున్నాయని, బీసీల చైతన్యం కోసం నిరంతరం బీసీ సంఘాల చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. జనాభా దామాషా ప్రకారం అన్ని రంగాల్లో తమ వాటాను సాధించుకోవడం కోసం రాజకీయ పార్టీలకు అతీతంగా అందర్నీ కలు పుకొని ముందుకు కొనసాగాలని సూచించా రు.
కార్యక్రమంలో బీసీ నాయకులు గణేశ్ చారి, శ్రీశైలం యాదవ్, కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, విక్రమ్ గౌడ్, కనకాల శ్యాం కురుమ, జాజుల లింగం గౌడ్, పాలకూరి కిరణ్, నాగరాజు గౌడ్, గణం నరసింహ, ఇంద్రం రజక, పవన్ సాయి గౌడ్, బండి గారి భరత్, తదితరులు పాల్గొన్నారు.