calender_icon.png 28 July, 2025 | 4:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీశైలం నుంచి కృష్ణమ్మ పరుగులు

28-07-2025 01:47:54 AM

- నాగార్జున సాగర్‌కు జలకళ..

- 584 అడుగులకు చేరుకున్న సాగర్ నీటిమట్టం

- మేడిగడ్డ బరాజ్‌కు పోటెత్తిన వరద

- భద్రాద్రి వద్ద నెమ్మదించిన గోదావరి 

నాగార్జునసాగర్, మహదేవపూర్(భూపాలపల్లి), భద్రాచలం, జూలై 27 (విజయక్రాంతి): ఎగువన భారీ వర్షాల కారణంగా శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో అధికారులు ప్రాజెక్టు ఒక గేటు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలానికి 1,20,482 క్యూసెక్కుల వరద వస్తుంది.

దీంతో 1,12,976 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. స్పిల్‌వే ద్వారా 26,744 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ నుంచి 20 వేల క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,917 క్యూసెక్కులు దిగువకు వెళ్తుంది.

శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 882.10 అడుగుల వద్ద ఉన్నది. ప్రాజెక్టు గరిష్ఠ నీటి నిల్వ 215.80 టీఎంసీలకు గాను ప్రస్తుతం 199.27 టీఎంసీలు ఉన్నాయి. శనివారం రాత్రి భారీగా వరద ఉండటంతో అధికారులు రెండు గేట్లు ఎత్తివేశారు.

అయితే ఆదివారం ఉదయానికి ప్రవాహం తగ్గడంతో ఒక గేటును మూసివేశారు. దీంతో ప్రస్తుతం ఒక గేటు గుండా 26,744 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. సోమవారం సాయంత్రానికల్లా ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

మంగళవారం కల్లా ప్రాజెక్టు గేట్లను ఎత్తే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. నాగార్జునసాగర్‌కు ఇన్ ఫ్లో 93115 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 35749 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 584 అడుగులకు చేరుకుంది. సాగర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 291.3795 టీఎంసీల నీరు ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని అంబటిపల్లి వద్ద నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్‌కి వరద పోటెత్తింది.

ఎగువన మహారాష్ర్టలో కురుస్తున్న భారీ వర్షాలతో కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో గోదావరి నది, ప్రణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద 4,40000 క్యూసెక్కుల నీటి ప్రవా హం రావడంతో మేడిగడ్డ బ్యారేజీ 85 గేట్లను ఎత్తి 4,40,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం నిలక డగా ఉంది. శనివారం 35.40 అడుగులకు చేరుకున్న నీటిమట్టం అక్కడినుంచి నెమ్మదిగా తగ్గుతూ ఆదివారం సాయంత్రానికి 34.60 అడుగులకు వ చ్చింది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

రాష్ట్రంలో 31 వరకు వర్షాలే

వెల్లడించిన వాతావరణ శాఖ 

పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

హైదరాబాద్, జూలై 27 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఈనెల 31 వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. ఈమేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.

సోమవారం ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశముందని పేర్కొంది. సోమవారం, మంగళవారం కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు రాష్ట్రంలో కురుస్తాయని తెలిపింది.