calender_icon.png 18 August, 2025 | 6:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రకృతి వ్యవసాయం.. ఆరోగ్యానికి శ్రేయస్కరం..

18-08-2025 12:18:46 AM

  1. ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం ఎంతో ప్రయోజనం
  2. సింగాయపల్లిలో క్రిస్టల్ విత్తనోత్పత్తిలో పలు విభాగాలను ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి 

గజ్వేల్, ఆగస్టు 17:  వ్యవసాయ రంగంలో దేశం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి, వ్యవసాయ ఉత్పత్తులను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి భారత్ చేరుకున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం సింగాయపల్లిలో క్రిస్టల్ విత్తనోత్పత్తి సంస్థను పరిశీలించి వివిధ విభాగాలను ఆయన ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అధిక దిగుబడులు సాధించాలని ఆకాంక్షించారు.

ప్రకృతి వ్యవసాయం ఆరోగ్యానికి శ్రేయస్కరం కాగా, క్రిమిసంహారక మందుల వినియోగాన్ని తగ్గించి కంపోస్టు ఎరువుల వాడకంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఆధునిక వ్యవసాయ విధానంతో విత్తన ఎంపిక నుండి పంట కోత వరకు ప్రయోజనం, అలాగే నీరు, ఎరువుల వినియోగం సరైన మోతాదులో ఉంటుందన్నారు. క్రిమిసహారక మందులు, అధిక ఎరువుల వినియోగంతో సాగు నేల ఆరోగ్యం దెబ్బతింటుందని,  సహజ  ఎరువులు వినియోగించి ఆరోగ్యకర పంటలు పండించాలన్నారు.

అంతేకాకుండా వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించే నూతన వంగడాలను ప్రోత్సహించి వాతావరణ మార్పులు, తెగుళ్ళ నుండి పంటలు కాపాడుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ,  డైరీ రంగాన్ని ప్రోత్సహిస్తూ అవసరమైన నిధులు కేటాయించడంతోపాటు ఎంఎస్పి పెంచుతూ పంటల బీమా పథకం  వర్తింపజేస్తుందన్నారు. భవిష్యత్తులో నీటి ఇబ్బందులు ఎదుర్కొనే క్రమంలో నీరు వృధా చేయకుండా భూమిలో చేర్చేందుకు దృష్టి పెట్టాలని, తద్వారా ప్రతి ఒక్కరికి ఎంతో ప్రయోజనం ఉంటుందని అన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీపై ఎంత ఒత్తిడి  వస్తున్నప్పటికీ ఇతర దేశాల పంట ఉత్పత్తుల దిగుబడుల జోలికి వెళ్లకుండా, దేశీయ వ్యవసాయం, రైతులను ప్రోత్సహిస్తున్నట్లు స్పష్టం చేశారు. అంతేకాకుండా ప్రపంచ దేశాలకు దీటుగా భారత్ ను గొప్ప ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దుతూ అమెరికా వంటి దేశాలకు దీటైన చెబుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో కంపెనీ యాజమాన్యం, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.