02-07-2025 12:49:31 AM
- నగరంలో జీహెఎంసీ ఫుడ్‌సేఫ్టీ అధికారులు స్పెషల్ డ్రైవ్
- పెరుగు, నెయ్యి వంటి డెయిరీ ఉత్పత్తులపై దృష్టి
- కల్తీ, నాణ్యతలో లోపాలుంటే కఠిన చర్యలు
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 1 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలోని హోటళ్లు, బేకరీల్లో జీహెచ్ ఎంసీ నజర్ పెట్టింది. ఫుడ్ సేఫ్టీ విభా గం నగరంలోని ఆహార ఉత్పత్తుల నాణ్యతను నిర్ధారించేందుకు నిరంతరం కృషి చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటివరకు బేకరీలు, స్వీట్ షాపులు, హాస్పిటల్ కిచెన్‌లపై నిర్వహించిన ఆకస్మిక దాడుల తర్వాత, ఇప్పుడు జీహెచ్‌ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు పెరుగు, నెయ్యి వంటి డెయిరీ ఉత్పత్తులపై దృష్టి సారించనున్నరు. నగర వ్యాప్తంగా డెయిరీ ఉత్పత్తుల తయారీ, నిల్వ, విక్రయ కేంద్రాలపై స్పెషల్ డ్రైవ్‌లు ప్రారంభం కానున్నాయని సమచారం.
ప్రజావాణి ఫిర్యాదులతో రంగంలోకి
జీహెఎంసీ ఫుడ్ సేఫ్టీ విభాగానికి ప్రజవాణిలో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల ఆధారంగా జీహెఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశాల మేరకు తనిఖీలు నగరంలోని అన్ని జోన్లలో నిర్వహించనున్నారు. డెయిరీ ఉత్పత్తుల్లో కల్తీ, రసాయనాల వాడకం లేదా గడువు ముగిసిన పదార్థాల వినియోగం, తయారీ, నిల్వ స్థలాల్లో అప రిశుభ్రత, సిబ్బంది హెయిర్‌నెట్‌లు, గ్లౌజ్‌లు, ఏప్రాన్‌లు ధరించడం, ఉత్పత్తులపై తయారీ తేదీ, గడువు తేదీ, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ వివరాలు సరిగ్గా ఉన్నాయా ఆహార వ్యాపార సంస్థలు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిబంధనలను పాటిస్తున్నాయా, పెరుగు, నెయ్యి వంటి ఉత్పత్తులు సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయబడుతున్నాయా లేదా, ఉత్పత్తుల తయారీ కేంద్రాలు, నిల్వ సౌకర్యాలు, విక్రయ కేంద్రాలలో ఈ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.