calender_icon.png 14 November, 2025 | 2:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు నిర్మాణంలో నిర్లక్ష్యం తగదు

14-11-2025 01:37:33 AM

  1. ఎడమవైపు కల్వర్టు నిర్మాణంలో అవకతవకలు

అధికారుల తీరుపై మంత్రి ఉత్తమ్ కు ఫిర్యాదు 

గరిడేపల్లి, నవంబర్13 : మండల కేంద్రం నుంచి కల్మలచెరువు మీదుగా అలింగాపూర్ వరకు నిర్మించిన రోడ్డు అధికారుల నిర్లక్ష్యం తగదని గరిడేపల్లి మాజీ సర్పం బండ పుల్లారెడ్డి, బండ చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. గురువారం గరిడేపల్లిలో వారు విలేకరులతో మాట్లాడుతూ రూ.30 కోట్ల నిధులతో నిర్మించిన గరిడేపల్లి అలింగాపూర్ రోడ్డు నిర్మాణం ప్రారంభంలోనే అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు.

మండల కేంద్రమైన గరిడేపల్లి లో ప్రారంభమైన ఈ రోడ్డు మొదట్లోనే ఎడమవైపు కల్వర్టు విస్తరణ విషయంలో,బెల్ మౌత్ నిర్మాణ విషయంలో అవకతవకలు,అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు.బుధవారం రోడ్డు ప్రారంభించేందుకు వచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఈ విషయంపై పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు.మంత్రికి ఫిర్యాదు చేసిన సమయంలో సంబంధిత అధికారి అక్కడ లేకుండా వెళ్లిపోయారని వారు ఆరోపించారు.

ఈ విషయంపై నేరుగా మంత్రిని కలిసి జరిగిన అవకతవకలపై వివరిస్తామని తెలిపారు.రోడ్డు ప్రారంభంలో బెల్ మౌత్ నిర్మాణం పూర్తి కాకముందే మంత్రిచే రోడ్డును ప్రారంభింపజేశారని వారు తెలిపారు.మంత్రి అభివృద్ధి విషయంలో రాజీ లేకుండా ఈ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నుంచి 30 కోట్లు మంజూరు చేయించారని,అధికారులు మాత్రం లాలూచీపడి రోడ్డు ఎడమవైపు విస్తరణలో అవకతవకలకు అవకాశం కల్పించాలని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎడమవైపు విస్తరణలో అవకతవకలు,అక్రమాలు చోటు చేసుకోవడంతో ఇప్పుడు ఈ రోడ్డు ప్రమాద కరంగా మారిందన్నారు.

ఏదైనా పెద్ద వాహనం వచ్చినా,ఇతర వాహనాలు వచ్చిన కల్మలచెరువు రోడ్డు వైపుకు మళ్లీన సమయంలో   ప్రమాదకరంగా పరిస్థితి ఉంటుందని వారు విలేకరులకు ఫోటోలతో సహా చూపించారు.ఈ విషయం సంబంధిత ఆర్ అండ్ బి అధికారులకు తెలిసినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు.ఈ విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి అనేకసార్లు తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేదని అన్నారు.

బెల్ మౌత్ విషయంలో,ఎడమవైపు విస్తరణలో అవకతవకలు అక్రమాలు చోటు చేసుకుంటున్న విషయాన్ని సాక్ష్యంతో సహా సంబంధిత ఆర్ అండ్ బి అధికారులకు చూపించి ప్రశ్నించడంతో,తమపై కేసు నమోదు చేయించారని వారు తెలిపారు.దీనిపై అనేకసార్లు ఆధారాలతో సహా చెప్పినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడంతో మంత్రి ఉత్తమ్ దృష్టికి ఈ రోడ్డు విషయాన్ని తీసుకువెళ్లినట్టు తెలిపారు.

ఈ విషయంపై మాజీ జెడ్పిటిసి పెండెం శ్రీనివాస్ గౌడ్ కు ఈ రోడ్డు విషయంపై వివరాలు తెలుసుకోవాలని మంత్రి ఆదేశించినప్పటికీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఎటువంటి ఒత్తిడిలకు లొంగకుండా రోడ్డుకు ఇరువైపులా ఒకే విధంగా నిర్మించాలని వారు డిమాండ్ చేశారు.అధికారులు స్పందించకపోతే ఈ రోడ్డు నిర్మాణంపై న్యాయపోరాటం చేస్తామని వారు హెచ్చరించారు.