23-01-2026 12:00:00 AM
నేడు సుభాష్ చంద్రబోస్ జయంతి :
భారతమాత విముక్తి కోసం జరిగిన స్వాతంత్ర సమర యజ్ఞంలో సమీదలైన మహామహులలెందరో ఉన్నప్పటికీ, వారిలో చెరగని ముద్ర వేసిన వారిలో నేతాజీ సుభాష్ చం ద్రబోస్ ఒకరు. ‘ఐక్యతే బలం’, ‘మీరు నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వేచ్ఛనిస్తా’, ‘చలో ఢిల్లీ’, ‘జైహింద్’ అని నినదించి భారత జాతీయ సైన్యాన్ని ముందుండి నడిపించిన ధీశాలీ. నాటి బెంగాల్ ప్రావిన్స్‌లోని కటక్ పట్టణంలో జనవరి 23, 1891న జానకినాథ్, ప్రభావతి బోస్‌ల దంపతులకు ఆరవ సంతానంగా నేతాజీ జన్మించారు.
బ్రిటిష్ వలసవాద పరాయి పాలనలో మగ్గుతున్న భారతమాత దాస్య శృంఖలాలను విడిపించడానికి సాయుధ పోరాటమే సరైన మార్గమని నమ్మిన నాయకుడు నేతాజీ. అహింసా పద్ధతిని అనుసరించిన గాంధీతో విభేదించి నేతాజీ చేసిన స్వతంత్ర పోరాటం దేశ చరిత్రలో మహోజ్వల ఘట్టంగా చెప్పవచ్చు. 1938లో గుజరాత్‌లోని హరిపురలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా బోస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గాంధీతో విభేదాలతో కారణంగా కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన బోస్ 1940 ఫార్వర్డ్ బ్లాక్‌ను స్థాపించారు.
ఫలితంగా బ్రిటిష్ ప్రభుత్వం బోసును అరెస్టు చేసి గృహ నిర్బంధంలో ఉంచిం ది. 1941లో చాకచక్యంగా తప్పించుకున్న బోస్ పెషావర్, కాబుల్ మీదుగా జర్మనీలోని బెర్లిన్‌లో అడుగుపెట్టి అక్కడ హిట్లర్, రిబ్బన్ ట్రాప్‌లతో చర్చలు జరిపి భారత స్వాతంత్య్ర పోరాటానికి సహాయ సహకారాలు కోరారు. కానీ జర్మనీ నుంచి ఆశించిన సహాయం అందకపోవడంతో జపాన్ చేరుకున్న బోస్ అక్కడ జపాన్ ప్రధాని జనరల్ హిడైకి టోజోను కలిసి భారత స్వాతం త్య్ర సంగ్రామానికి సహాయం అందించవలసినదిగా కోరారు.
రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం భారత్‌కు చెందిన కెప్టెన్ మోహన్ సింగ్, ఇతర భారత సైనికులతో మాట్లాడి 1942లో ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించారు. కెప్టెన్ మోహన్ సింగ్ ఆధ్వర్యంలోనే బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడేలా ప్రోత్సహించిన గొప్ప రాజనీతిజ్ఞుడు నేతాజీ. ఆ తర్వాత జపాన్ లో ఉన్న భారత విప్లవ నాయకుడు రాజ్ బిహారీ బోస్‌ను ఒప్పించి ఇండియన్ ఇండిపెండెంట్ లీగ్ బాధ్యతలు అప్పగించాడు. ఇండియన్ నేషనల్ ఆర్మీ బాధ్యతలు తీసుకున్న నేతాజీ దానికి ‘ఆజాద్ హిందూ ఫౌజ్’ అని పేరు పెట్టారు.
ఆగ్నేయాసియా, మలయా, సింగపూర్, బర్మాలలో యుద్ధ ఖైదీలుగా ఉన్న భారతీయులందరినీ ఆజాద్ హిందూ ఫౌజ్‌లో చేర్పించి, 5 రెజిమెంట్లుగా విభజించి వారికి కఠినమైన శిక్షణ అందించారు. 1943లో సింగపూ ర్‌లో ‘ఆజాద్ హింద్’ తాత్కాలిక ప్రవాస ప్రభుత్వ ఏర్పాటు ప్రకటించిన బోస్ అధినేతగా బాధ్యతలు స్వీకరించారు. ఈ ప్రభుత్వాన్ని జపాన్‌తో సహా అక్ష్యరాజ్య కూటమిలోని ఎనిమిది దేశాలు గుర్తించేటట్లు చేశారు. అయితే రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్‌కు ఎదురైన వ్యతిరేక సంఘటనల వల్ల ఆజాద్ హిందూ పౌజ్ సైన్యం బ్రిటిష్ చేతిలో ఓడిపోయింది.
1945, ఆగస్టు 18న నేతాజీ సుభాష్ చంద్రబోస్ టోక్యో వెళ్లే క్రమంలో మార్గమధ్యంలో విమానం కూలి మరణించినట్లు జపాన్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ నేటికీ నేతాజీ మరణం అనుమానాస్పదంగానే మిగిలిపోయింది. ఎన్ని కమిటీలు వేసినప్పటికీ నేతాజీ మరణం ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. మొత్తంగా భరతమాత విముక్తి పోరాటంలో నేతాజీ ఆరని అగ్నిజ్వాలగా మిగిలిపోయారు.
కావలి చెన్నయ్య, 9000481768