19-11-2025 12:00:00 AM
నిజామాబాద్, నవంబర్ 18 (విజయ క్రాంతి): తెలంగాణ విశ్వవిద్యాలయాల్లో 2012 నాటి నియామకాలపై 13 ఏళ్లుగా సాగుతున్న న్యాయపోరాటానికి ఉన్నత న్యాయస్థానం (హైకోర్టు) తీర్పు చారిత్రాత్మక ముగింపు పలికింది. ఈ అక్రమ నియామకాలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు, రెండు భిన్నమైన వర్గాల్లో భిన్నమైన భావోద్వేగాలను రగిల్చింది.
దశాబ్ద కాలంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థుల లోకంలో ఇది నూతనోత్సాహాన్ని నింపితే, దశాబ్ద కాలానికి పైగా ’అక్రమ’ పద్ధతుల్లో కొలువుల్లో కొనసాగుతున్న ప్రొఫెసర్ల గుండెల్లో గుబులు రేపుతోంది.
నిరుద్యోగుల సంబరం.. కొత్త ఆశలు:
2012లో వెలువడిన నోటిఫికేషన్లో యూజీసీ నిబంధనలు, రోస్టర్ పాయింట్లు, రిజర్వేషన్ల వంటి కీలక నియమాలను గాలికి వదిలేసి వందలాది (దాదాపు 103 టీచింగ్, 174 నాన్-టీచింగ్) నియామకాలను చేపట్టినట్లు ఆనాటి నుంచే విద్యార్థి సంఘాలు, నిరుద్యోగ జేఏసీలు పోరాటం చేస్తున్నాయి. వారి పోరాటానికి ఇప్పుడు న్యాయరూపంలో విజయం లభించింది. తాజా హైకోర్టు తీర్పుతో ఈ పోస్టులన్నీ రద్దు కానున్నాయి.
ఒకవేళ ప్రభావిత ప్రొఫెసర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించినా, నియామక ప్రక్రియలో జరిగిన అక్రమాలు, ఉల్లంఘనలకు బలమైన ఆధారాలు ఉన్న నేపథ్యంలో... సుప్రీం కోర్టు సైతం హైకోర్టు తీర్పునే సమర్థించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదే జరిగితే, ఈ 100కు పైగా బోధనా సిబ్బంది పోస్టులన్నీ మళ్లీ ఖాళీ అయినట్లే లెక్క.
ప్రభుత్వం త్వరలో చేపట్టబోయే భారీ నియామక ప్రక్రియలో ఈ ఖాళీలను కూడా కలిపి, పారదర్శకంగా భర్తీ చేయనున్నారు. ఇది ఏళ్లుగా అర్హత సాధించి, సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది నిరుద్యోగ అభ్యర్థులకు బంగారు అవకాశంగా మారనుంది. అందుకే, ఈ తీర్పును నిరుద్యోగ లోకం ‘పోరాటానికి దక్కిన ఫలం‘గా అభివర్ణిస్తూ సంబరాలు చేసుకుంటోంది.
2012 బ్యాచ్ ప్రొఫెసర్లలో భయం.. జీతాల రికవరీపై ఆందోళన
ఈ తీర్పు నాణేనికి రెండో వైపు చూస్తే, 2012 నోటిఫికేషన్ ద్వారా నియామకమైన వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సుమారు 13 ఏళ్లుగా వారు సర్వీసులో కొనసాగుతున్నారు, ఆచార్యాలుగా, ప్రొఫెసర్లుగా హోదాలు అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఒక్క తీర్పుతో వారి ఉద్యోగాలు ప్రశ్నార్థకంగా మారాయి. సుప్రీం కోర్టుకు వెళ్లినా ఊరట లభించకపోతే, వారు తక్షణమే ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుంది.
అయితే, వారిని ఇప్పుడు ఉద్యోగం కంటే ‘జీతం‘ విషయమే ఎక్కువగా భయపెడుతోంది. న్యాయస్థానం ఈ నియామకాలను ’అక్రమం’ అని తేల్చినందున, ఈ 13 ఏళ్ల పాటు వారు తీసుకున్న జీతభత్యాల సంగతేమిటనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. సాధారణంగా ప్రభుత్వానికి నష్టం కలిగితే, ఆ మొత్తాన్ని రాబట్టడానికి ‘రెవెన్యూ రికవరీ యాక్ట్‘ ను ప్రయోగించే అవకాశం ఉంటుంది.
మరి ఉన్నత విద్యాశాఖ ఈ ప్రొఫెసర్ల నుంచి 13 ఏళ్ల జీతాలను రికవరీ చేసేందుకు సిద్ధపడుతుందా? అనే ప్రశ్న సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ఒకవేళ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తే, ఒక్కో ప్రొఫెసర్ కోట్లాది రూపాయలను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఊహే 2012 బ్యాచ్ ప్రొఫెసర్లను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. వారి ఉద్యోగం పోవడమే కాకుండా, ఇంతకాలం సంపాదించింది తిరిగి కట్టాల్సిన పరిస్థితి వస్తే, వారి పరిస్థితి దయనీయంగా మారుతుంది.
మొత్తంగా, ఈ తీర్పు తెలంగాణ ఉన్నత విద్యావ్యవస్థలో ప్రక్షాళనకు నాంది పలుకుతూనే, అనేక సంక్లిష్టమైన పరిణామాలకు తెరలేపింది. రాబోయే రోజుల్లో ప్రభుత్వం, ఉన్నత విద్యాశాఖ తీసుకోబోయే నిర్ణయాలు తీవ్ర ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మున్ముందు ఏం జరగనుందో వేచి చూడాల్సిందే.