calender_icon.png 19 November, 2025 | 3:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్టీ పరంగా వద్దు.. చట్టపరంగా కావాలి

19-11-2025 12:00:00 AM

  1. బీసీ రిజర్వేషన్లపై క్యాబినెట్ నిర్ణయం దుర్మార్గం
  2. ఈ నెల 21 నుంచి రాష్ర్టవ్యాప్తంగా ఆందోళనలు
  3. బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్ కృష్ణయ్య

ముషీరాబాద్, నవంబర్ 18 (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్లు పార్టీ పరంగా వద్దు.. చట్టపరంగా కావాలని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇస్తామని క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం దుర్మార్గం అని బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్ కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇస్తామని ముఖ్యమంత్రి, మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు పదేపదే ప్రకటించి నమ్మించి మోసం చేశారని విమర్శించారు.

మంగళవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి బాణాల అజయ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కృష్ణయ్య మాట్లాడారు. కాంగ్రెస్ నాయకత్వం వహించే ఇండియా కూటమికి లోక్ సభలో 240 మంది ఎంపీలు ఉన్నా ఒక్కరోజు కూడా పార్లమెంట్‌లో ప్రశ్నించలేదని ఆరోపించారు. సోమవారం జరిగిన క్యాబినేట్‌లో మొదటగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుపుతాం అని ప్రకటించారు.

గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీపరంగా ఉండవని, పార్టీ పరంగా ఇస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. మార్చిలోపు ఎన్నికలు పూర్తి చేయకపోతే మూడు వేల కోట్లు వృథా అవుతాయని సీఎం అంటున్నారని, మూడు వేల కోట్ల బడ్జెట్ కంటే బీసీ రిజర్వేషన్లు ముఖ్యమని అన్నారు. హై కోర్టులో కేసు బలంగా వుందని తప్పకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

కోర్ట్ తీర్పు వచ్చే వరకు సీఎం పునరాలోచన చేయాలని, లేని పక్షంలో తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. అన్ని పార్టీలు బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఈ నెల 21 నుంచి రాష్ర్ట వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ సమావేశంలో బీసీ సంఘం నేతలు నీల వెంకటేష్ ముదిరాజ్, సి రాజేందర్, జి అనంతయ్య, పగిళ్ల సతీష్ కుమార్, జిల్లపల్లి అంజి పాల్గొన్నారు.