30-07-2025 12:32:43 AM
సిద్దిపేట, జూలై 29 (విజయక్రాంతి)/ సిద్దిపేట రూరల్/ నంగునూరు: రాష్ట్రంలో 10 సంవత్సరాలుగా ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. మంగళవారం సిద్దిపేట పట్టణంలోని కొండ మల్లయ్య గార్డెన్ లో సిద్దిపేట రూరల్ అర్బన్ పట్టణం లోని కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేసి మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడారు.
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక ప్రజాప్రయోజన పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. ఎన్నికల హామీల ప్రకారం రేషన్ కార్డుల పంపిణీతో పాటు ఇందిరమ్మ ఇండ్లను కూడా అందజేస్తున్నామని చెప్పారు. సిద్దిపేట అర్బన్, రూరల్ మండలాలకు దాదాపు 10 వేల కొత్త రేషన్ కార్డులు, నంగునూరు మండలంలో 809 రేషన్ కార్డులు నారాయ ణరావుపేట మండలంలో 1373 నూతనంగా రేషన్ కార్డులు లబ్ధిదారులకు పంపిణీ చేయబడుతున్నాయని, జిల్లా వ్యాప్తంగా పాత కార్డుల్లో లబ్ధిదారుల చేర్పులు, కొత్త కార్డులు కలిపి 52 వేల మందికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు.
పేదలకు పోషక విలువలతో కూడిన సన్న బియ్యం అందించేందుకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేపట్టిందని, దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం 9 వేల కోట్లు ఖర్చు చేసిందని వెల్లడించారు. రేషన్ కార్డుల ద్వారా ఉచిత సన్న బియ్యం మాత్రమే కాకుండా రూ.200 ఫ్రీ కరెంట్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్లు వంటి అనేక సంక్షేమ పథకాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. సిద్దిపేట నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు, జిల్లాకు 10 వేల ఇండ్లు మంజూరు చేయబడ్డాయని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 17 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వివరించారు.
జిల్లా కలెక్టర్ కె. హైమావతి మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లను ఇప్పుడు ప్రభుత్వం అందజేస్తోందని అన్నారు. జిల్లాలో 26 వేల కొత్త రేషన్ కార్డులు పంపిణీ జరుగుతుండగా, సిద్దిపేట నియోజకవర్గంలో 9,971 కొత్త కార్డులు పంపిణీ అవుతున్నాయని, వీటితో పాటు 21,300 మంది పాత కార్డుల్లో చేర్పులు జరిగాయని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న లబ్ధిదారులు కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సి ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, జిల్లా ఇన్చార్జి కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజేష్ చంద్ర, అదనపు కలెక్టర్ గరీమ అగర్వాల్, ఆర్డీవో సదానందం, డీఎం సివిల్ సప్లై ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.