calender_icon.png 14 January, 2026 | 2:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాదె ఇన్నయ్య ఇంట్లో ఎన్‌ఐఏ తనిఖీలు

14-01-2026 01:04:18 AM

  1. మా ఇల్లు ప్రజాదరణ ఆశ్రమంలో సోదాలు
  2. రూ.లక్ష నగదు, కీలక పత్రాలు స్వాధీనం
  3. ఉదయం ౬:30 గంటల నుంచే అధికారుల తనిఖీలు

జనగామ, జనవరి 13 (విజయక్రాంతి): మావోయిస్టులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నాడని ఎన్‌ఐఏ పోలీసుల అదుపులో ఉన్న సామాజికవేత్త, మా ఇల్లు ప్రజాదరణ ఆశ్రమం నిర్వాహకుడు గాదె ఇన్నయ్య ఇంట్లో ఎన్‌ఐఏ అధికారులు మంగళవారం ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఉదయం 6:30 గంటలకు జనగామ జిల్లా జాఫర్‌గడ్ మండలం రేగడి తండాలోని మా ఇల్లు ఆశ్రమానికి చేరుకున్న జాతీయ దర్యాప్తు బృందం అధికారులు, పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు.

అలాగే సాగరంలోని ఆయన ఇంట్లో కూడా తనిఖీలు చేసి రూ.లక్ష నగదుతో పాటు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అలాగే మా ఇల్లు ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న విద్యార్థులకు సంబంధించిన సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్న అధికారులు.. సీసీ కెమెరా రికార్డు చేసిన దృశ్యాలను కూడా పరిశీలించినట్లు సమాచారం. ఆశ్రమ నిర్వహణకు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరెవరు ఇస్తున్నారనే అంశంపై కూడా విచారణ చేసినట్లు తెలుస్తోంది.

గత ఏడాది డిసెంబర్ 21న గాదె ఇన్నయను ఎన్‌ఐఏ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కేసుకు సంబంధించి ఆయనను విచారించడానికి పోలీస్ కస్టడీ కోసం నాంపల్లి కోర్టును కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో ఎన్‌ఐఏ పోలీసులు గాదె ఇన్నయ్య ఇంట్లో, ఆయన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మా ఇల్లు అనాధాశ్రమంలో సోదాలు నిర్వహించడం సంచలనం సృష్టించింది.