calender_icon.png 28 November, 2025 | 12:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసరి సముద్రం చెరువులో రాత్రిళ్ళు చేపల వేట.!

27-11-2025 10:00:10 PM

- మత్స్యకారుల కళ్ళుగప్పి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న దళారులు..

- ఆందోళనలో స్థానిక మత్స్యకారులు..

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ కేసరి సముద్రం చెరువులో నిబంధనలకు విరుద్ధంగా రాత్రుళ్ల సమయంలో అక్రమార్కులు చేపల వేట కొనసాగిస్తున్నారు. స్థానిక మత్స్యకారుల కళ్ళు గప్పి భారీ వలల సహాయంతో చేపలు పట్టి భారీ వాహనాల సహాయంతో ఇతర రాష్ట్రాలకు చేపలను తరలిస్తున్నారని స్థానిక మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన జాలర్ల సహాయంతో దళారులు తెలంగాణ ప్రాంత చెరువుల చేపలను ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా అదే వృత్తిపై ఆధారపడుతున్న మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయే ఆస్కారం ఉందని పలుమార్లు నిరసన వ్యక్తం చేశారు.

స్థానిక మత్స్యకార సొసైటీలోకి అక్రమంగా చొరపడిన కొంత మంది సభ్యులతో చేతులు కలిపి చెరువులను అర్రాజ్ పాటతో ఆంధ్ర జాలర్లు చేపలు పడుతుండడంతో స్థానిక మత్స్యకారులు కోర్టును ఆశ్రయించగా కోర్టు సైతం స్థానిక మత్స్యకారులే చేపలు పట్టుకోవాలని తీర్పు వెలువరించింది. కానీ వాటిని అమలు చేయాల్సిన అధికారులు కూడా అంటి ముట్టనట్టు వ్యవహరించడంతో దళారులు రాత్రుళ్ళ సమయంలో దొంగ చాటుగా చేపలు పట్టి ఇతర రాష్ట్రాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని స్థానిక మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.